-ఇప్పుడే కాపాడుదాం… రేపటి తరాలకు భద్రత కల్పిద్దాం
-100 రోజుల కార్యాచరణతో సత్ఫలితాలు సాధిద్దాం
-ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు
-విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార- నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
జల వనరుల శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యతకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతతో నీటి భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యాచరణతో జల వనరుల పరిరక్షణకు కృషిచేద్దామన్నారు. గౌరవ సీఎం నేతృత్వంలో ఇప్పటికే జల భద్రతకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని.. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పేర్కొన్నారు.
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు 100 రోజుల కార్యక్రమం జరగనుందని.. నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీకృత నీటి నిర్వహణ, చెరువులు-కాలువల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, నీటి సంరక్షణ విధానాలు, పచ్చదనం పెంపొందించడం, గ్రామ నీటి బడ్జెట్ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. భాగస్వామ్య పక్షాలు క్రియాశీలంగా పాల్గొని వీటిని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా నీటి వనరుల అధికారి (డీడబ్ల్యూఆర్‌వో) పి.రామచంద్రరావు, ఈఈ రామకోటయ్య, డీఈ బాబురావు, జల వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News