Breaking News

డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, ప్రజలు విలవిల

-బంకుల దగ్గర బారులు తీరున్న వినియోగదారులు
-నిత్యవసర ధరలు పెరిగే ప్రమాదం
-ప్రణాళిక లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
-సీఎం చంద్రబాబు సమీక్షలకే పరిమితం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరతతో రైతులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, యుద్ధప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్నిరోజులుగా డీజిల్ కొరతతో గోదావరి డెల్టా ప్రాంతంలోని రైతులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. వరి కోత యంత్రాలకు డీజిల్ లేక పంట చేతికొచ్చిన వేళ ఈ సమస్య తలెత్తినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని, మరోవైపు డీజిల్ కొరతతో దిగుబడి తగ్గిపోయి, రైతులను నష్టాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు ముంబయి పర్యటనలో బిజిబిజీగా ఉండి, కేవలం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్ లెట్స్ (పెట్రోల్ బంకులు) ఉండగా, పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని, సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినప్పటికీ, ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు వివరించారన్నారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని అధికారుల లెక్కల ఆధారంగా స్పష్టమవుతోందన్నారు. ఈ సమయంలో సీఎం కేవలం సమీక్షలు నిర్వహించి, అధికారులకు ఆదేశాలతోనే సరిపెట్టడం తగదన్నారు.
భవిష్యత్తులో డీజిల్, పెట్రోల్ కొరత అన్ని రంగాలపై పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదముందన్నారు. ఈ సమస్య పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీఎం నుండి
మంత్రులు వరకు విదేశాలు, పలు రాష్ట్రాల పర్యటనలకు పరిమితం అయ్యారనీ, మరికొందరు మంత్రులు హైదరాబాద్ కి పరిమితం అయ్యారన్నారు. ఇలా ఉంటే ప్రజా సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారని సూటిగా ప్రభుత్వంని ప్రశ్నించారు. ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడ ఉన్నదీ సమాచారం లేదన్నారు. సీఎం చంద్రబాబు ముంబయి పర్యటనలో ఉండి ఈ సమస్యపై పెద్దగా స్పందించడం లేదన్నారు. ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని, సరఫరాలో వచ్చిన లోపాల వల్ల బంకులలో మూత పడుతున్నాయని అని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన తగదన్నారు.
ఇక డీజిల్, గ్యాస్ వంటివి కొరత రాకుండా చూడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూటమి నేతలు బిజీ అయిపోయారని, హౌరా బ్రిడ్జి దగ్గర ఫోటో షూట్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో పెట్రోలు బ్యాంకులన్నీ వెలవెలబోతున్నాయని, వాహనాల రవాణా ఆగిపోయిందని వివరించారు. పనులు మానుకొని ప్రజలు గంటల తరబడి ఆయిల్ కోసం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. జన జీవనం స్తంభించే పరిస్థితి ఏర్పడిందని, పక్కా ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ అసమర్థత పాలనతోనే ఈ దుస్థితికి కారణమైందని వివరించారు. డీజిల్, పెట్రోల్ కొరతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తక్షణమే ఈ సమస్యపై దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికపై ఆయిల్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతులు, వినియోగదారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగాలిసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఇప్పటికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *