-గుంతల రోడ్లకు గుడ్ బై చెప్పాం
-ప్రభుత్వ సేవలు పొందడం ప్రజల హక్కుగా మార్చాం
-సుపరిపాలన పూర్తయి రెండు సంవత్సరాల విజయోత్సవ వేడుకల సభలోకేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సుపరిపాలన ద్వారా సమాజంలో మార్పుకు కృషి చేస్తూ, భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.
కూటమి ప్రభుత్వం కొలువై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సుపరిపాలన విజయోత్సవాలను గురువారం నగరంలోని శ్రీ సత్యసాయి గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా సమాజంలో మార్పుకు కృషి చేస్తున్నామన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేశామని అలాగే డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపామన్నారు. మత్తు మాఫియా పై రాజీలేని పోరాటం చేస్తూ, విషాన్ని విక్రయించే దందాను అరికట్టామన్నారు. అలాగే గుంతల రోడ్లకు గుడ్ బై చెప్పామన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పరుగెట్టిస్తూ కాలువల్లో పారే నీటిని రైతుల మోములో చిరునవ్వుగా భావించామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వేయి సర్వీసులను అందిస్తూ, ప్రభుత్వ సేవలు పొందడం ప్రజల హక్కుగా మార్చామన్నారు. అలాగే రాజధాని పనులను వేగవంతంగా చేస్తున్నామని, ఔటర్ రింగ్ రోడ్డును ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశంలోనే సమర్థవంతమైన నేతగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పేదవాని మొహంలో ఆనందాన్ని చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వివిధ రకాల సంక్షేమ పథకాలతో ప్రజలందరి మన్ననలను తమ ప్రభుత్వం పొందుతుందన్నారు. ప్రజల్లో ఉన్న ఇటువంటి సంతృప్త స్థాయిని కొనసాగించడానికి అందరం కలిసి ఏకోన్ముఖంగా కృషి చేద్దామన్నారు.
రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ వికసత భారత్ లక్ష్యసాధనలో భాగంగా స్వర్ణాంధ్ర, 2047 సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాబోయే ప్రతి ఎన్నికలలోను కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గత పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. సమాజంలో ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ, ప్రజా శ్రేయస్సే పరమావధిగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై నడిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా తయారు చేస్తున్నామన్నారు.
గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ రెండు సంవత్సరాల తక్కువ కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఆత్మసంతృప్తితో, ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకు రావడం గర్వకారణంగా ఉందన్నారు.
ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఈ రెండేళ్ల కాలంలో దాదాపు 1468 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పూర్తిచేశామన్నారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు, తాడికొండ శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, టిడిపి,బిజెపి, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, తిరుపతిరావు గాదె వెంకటేశ్వరరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News