-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ నివాస సంస్థలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లు, కేజీబీవీలు మరియు ఇతర విద్యా సంస్థలను సుస్థిరమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణ బాధ్యతాయుతమైన క్యాంపస్‌లుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ (NZHC) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ (NZHC) కార్యక్రమంపై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధ్యక్షతన జరిగింది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ కార్యక్రమం కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధికి మాత్రమే పరిమితం కాకుండా, పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం మరియు విద్యార్థుల సంక్షేమానికి దీర్ఘకాలిక పెట్టుబడిగా నిలుస్తుందన్నారు. తిరుపతి జిల్లాలో తొలి దశ (ఫేజ్-I) కింద మొత్తం 58 విద్యా సంస్థలను ఎంపిక చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎంపిక చేసిన సంస్థల్లో
👉🏼10 సామాజిక సంక్షేమ హాస్టళ్లు,
👉🏼12 బీసీ సంక్షేమ హాస్టళ్లు,
👉🏼7 గిరిజన సంక్షేమ సంస్థలు,
👉🏼10 ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలు,
👉🏼3ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థలు,
👉🏼12 కేజీబీవీలు మరియు 4 ఏపీఆర్‌ఎస్ సంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. వాటిలో నెట్ జీరో ఎనర్జీ కింద సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం, జల సుస్థిరత కింద వర్షపు నీటి సేకరణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవన చర్యలు, నెట్ జీరో వేస్ట్ కింద వ్యర్థాల వేరు చేయడం, కంపోస్టింగ్ మరియు రీసైక్లింగ్, అలాగే నెట్ జీరో కార్బన్ కింద మొక్కల పెంపకం మరియు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నిధులు, ప్రభుత్వ పథకాలు మరియు సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి ప్రతి సంస్థ ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ కార్యక్రమం అమలుకు మద్దతుగా జిల్లా ప్రాజెక్ట్ నిర్వహణ విభాగం (DPMU) ఏర్పాటు కోసం ఫారెస్ట్స్ బై హార్ట్‌ఫుల్‌నెస్ ఫౌండేషన్ (FbHF) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రాథమిక అంచనాలు, సంస్థల వారీ కార్యాచరణ ప్రణాళికలు, మొక్కల పెంపకం, జీవవైవిధ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, పునరుత్పాదక ఇంధన చర్యలు, వ్యర్థాల నిర్వహణ, వాష్ (WASH) కార్యక్రమాలు, సామర్థ్య పెంపు, ఎంఐఎస్ ఆధారిత పర్యవేక్షణ, పురోగతి నివేదికలు మరియు కార్బన్ ఆఫ్‌సెట్ కొలతలకు సంబంధించి DPMU సాంకేతిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. విభాగాల బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తూ, NREDCAP సౌరశక్తి ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, DWMA, DRDA, పంచాయతీరాజ్ శాఖలు వర్షపు నీటి సేకరణ నిర్మాణాలను చేపట్టాలని, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణకు సాంకేతిక సహకారం అందించాలని, అటవీ శాఖ మొక్కల పెంపకం మరియు జీవవైవిధ్య అభివృద్ధికి నాయకత్వం వహించాలని, RWS&S శాఖ నీటి సంరక్షణ చర్యలకు మద్దతు ఇవ్వాలని అన్నారు. సంక్షేమ మరియు నివాస విద్యా సంస్థలు ప్రతి సంస్థకు నోడల్ అధికారులను నియమించి, గ్రీన్ కమిటీలను బలోపేతం చేసి, విద్యార్థులు మరియు సిబ్బంది కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చూడాలని తెలిపారు. కార్యనిర్వహణ వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, అర్హత గల క్యాంపస్‌లలో సౌరశక్తి వినియోగం, అధిక మనుగడ రేటుతో మొక్కల పెంపకం, చురుకైన గ్రీన్ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా తిరుపతి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శవంతమైన నెట్ జీరో & హెల్తీ క్యాంపస్ జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి పి ఓ సుశీల దేవి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి వి.వి.హరీష్, బీసీ సంక్షేమ శాఖ అధికారి భరత్ కుమార్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజా సోము, సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పద్మజ, ఫారెస్ట్ బై హార్ట్ ఫుల్ నెస్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News