మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా మిగిలి ఉన్న 10 గ్రామ పంచాయతీలకు ‘హర్ ఘర్ జల్’ ధ్రువీకరణ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డీటీయూ ఏర్పాటు చేసిన 30 గ్రామ పంచాయతీల్లో ‘హర్ ఘర్ జల్’ గ్రామాలుగా ప్రకటించేందుకు అవసరమైన మౌలిక లోపాలను గుర్తించి తదుపరి సమావేశానికి నివేదిక సమర్పించాలని సూచించారు.
వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల (ఐహెచ్హెచ్ఎల్) నిర్మాణాలను వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న 511 మరుగుదొడ్లను వెంటనే గ్రౌండింగ్ చేసేలా ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించిన బకాయి చెల్లింపులను త్వరితగతిన విడుదల చేయించేందుకు బీపీసీఎల్ సంస్థతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మల్లంపూడి నీటి సరఫరా పథకంలో ఓహెచ్ఎస్ఆర్ స్థానంలో జీఎల్ఎస్ఆర్ నిర్మాణానికి అవసరమైన పరిపాలనా మార్పులు వెంటనే పూర్తి చేసి టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని, ఇంకా ప్రారంభం కాని అన్ని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. గరాలదిబ్బ, పెద్దపట్నం, భోగిరెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో మంజూరైన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో 100 సామూహిక ఇంకుడు గుంతల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు వెంటనే పంపించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వహణాధికారి సోమశేఖర్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డివిజన్లు, మండలాల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News