Breaking News

ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ 188వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎచ్‌డీసీ) 188వ బోర్డు సమావేశం సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డు, జీవిత, సోమశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) విశ్వ, ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ) లక్ష్మీనాథ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలువురు అధికారులు ఆన్‌లైన్ ద్వారా సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారుల సంక్షేమం, లేపాక్షి సంస్థ అభివృద్ధి, కొత్త షోరూమ్‌ల ఏర్పాటు, మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతం, సాంప్రదాయ కళలకు ప్రోత్సాహం, కళాకారుల జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కళాకారులకు ప్రభుత్వ పథకాల ద్వారా మరింత మద్దతు అందించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.

సంస్థ అభివృద్ధిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కొత్త లేపాక్షి షోరూమ్‌ను రాబోయే మూడు నెలల్లో ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఈ షోరూమ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, అంతర్గత అలంకరణ పనులు, విక్రయాల విభాగం ఏర్పాటు, సిబ్బంది నియామక ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. త్వరలోనే ఈ షోరూమ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో కూడా కొత్త లేపాక్షి షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో షోరూమ్‌ల ఏర్పాటుకు సంబంధించి స్థలాల ఎంపిక, నిర్మాణ పనులు, నిర్వహణ విధానాలు వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

ఈ షోరూమ్‌ల ద్వారా హస్తకళాకారులు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ లభించడంతో పాటు వారి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సంప్రదాయ కళలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, కొత్త నమూనాలను రూపొందించడం, అంతర్జాతీయ మార్కెట్లలో లేపాక్షి ఉత్పత్తులకు మరింత గుర్తింపు తీసుకురావడం వంటి అంశాలపై కూడా చర్చించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలోని హస్తకళాకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. హస్తకళాకారుల జీవనోపాధిని మెరుగుపరచడం, సంప్రదాయ కళలను భావితరాలకు అందించడం, లేపాక్షి సంస్థను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి హస్తకళాకారుడికి ప్రభుత్వ సహకారం అందేలా చర్యలు చేపడతామని, కళాకారుల ప్రతిభకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అభివృద్ధి పనులను వారం రోజుల కాల వ్యవధిలో ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని మానస సరోవరం పార్క్ లోని చెరువు, నల్లపాడులోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *