-70 సంవత్సరాలు సమైక్య రాష్ట్ర చరిత్రలో పిఆర్సి జాప్యం కావటం ఇదే ప్రథమం
-జిపిఎఫ్, ఏపీ జీ ఎల్ ఐ డబ్బులు ఇవ్వకపోవటం దారుణం- జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ విద్యాసాగర్
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట పట్టణంలో గల ఏపి యన్ జి ఓ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో గురువారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా ఏపీ ఎన్జీవోల సంఘం, జిల్లా అధ్యక్షులు ఎ .విద్యాసాగర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పి.ఆర్.సి ని 40నెలలుగా అమలు చేయకపోవడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 70ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పిఆర్ సి ఇంత జాప్యం కాలేదన్నారు. 7 డీఏలు, జిపిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ డబ్బులు కూడా ఇవ్వకపోవడం ఆందోళనలు కలిగిస్తోందని అన్నారు. సిపిఎస్ ను రద్దు చేస్తామని అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ రెండున్నర సంవత్సరాలు అయినా కూడా పట్టించుకోవట్లేదన్నారు. ఉద్యోగులు ఇంతకాలం చాలా సమన్వయంతో సంయమనం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ముఖ్య సలహాదారులు కి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పి.ఆర్.సి పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే డిశంబర్ 7 నుండి ఏపి జేఏసి, అమరావతి జేఏసి సంయుక్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఏడు నుంచి 9వ తేదీ వరకు అన్ని శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 10వ తేదీన జిల్లా కేంద్రాలు తాలూకా కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రదర్శనలు ధర్నాలు నిర్వహిస్తామని 16న తాలూకా కేంద్రాలు 21న జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు జేఏసీ పిలుపునిచ్చిందని ఆయన చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బాధ్యత యుతమైన పదవీలో ఉన్న మంత్రి విఆర్ఓ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని , రాష్ట్ర విఆర్వోలు సంఘం చేపట్టే ఆందోళనలకు ఎన్జీవోలు సంఘీభావం మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సమావేశంలో జిల్లా ఎన్జీవో అసోసియేషన్ ఉపాధ్యక్షుడుయం రాజుబాబు విజయవాడ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు జె స్వామి, ప్రసాద్ జగ్గయ్యపేట తాలూకా ఎన్జీవోస్ అధ్యక్షుడు వెంకట్రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా వినియోగదారుల సంఘం నేతలు గెంటేల నారాయణ రావు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News