బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభుత్వ యంత్రాంగాన్ని అలెర్ట్ చేసిన హోంమంత్రి అనిత

-బుధ, గురువారాల్లో భారీ వర్షాల నేపధ్యంలో అధికారులకు ఆదేశాలు
-వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
-వాగులు, కాజ్‌వేల వద్ద ప్రత్యేక నిఘా – SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉంచాలి
-ప్రజలు ప్రభుత్వం జారీ చేసే అధికారిక సూచనలను పాటించాలి : హోంమంత్రి అనిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు.

తీవ్రవాయుగుండంప్రభావంతో బుధ, గురువారాల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోంమంత్రి తెలిపారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వంశధార, నాగావళి నదుల ప్రవాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలని హోంమంత్రి సూచించారు. ఒడిశా సరిహద్దు జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ఆదేశించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF), ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచి, క్షేత్రస్థాయి అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా నిత్యావసరాలు, వైద్యం,ఇతర అత్యవసర సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు.పొంగిపొర్లే వాగులు, ప్రమాదకరమైన కాజ్‌వేలు, ముంపు ప్రాంతాల వద్ద తప్పనిసరిగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా వాహనాలు, ప్రజల రాకపోకలను కట్టడి చేయాలని సూచించారు.

ఈ తీవ్రవాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్‌, పాతబడిన/ శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండరాదని సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వం జారీ చేసే అధికారిక సూచనలను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *