-సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నగర ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులు
-ఓటీఎస్ పై తెలుగుదేశం విమర్శలు అర్థరహితం
-వాంబే కాలనీవాసుల వద్ద రూ. 65 వేలు కట్టించుకొని నిలువుగా మోసగించింది టీడీపీ ప్రభుత్వం కాదా..?
-వీఎంసీ మీడియా పాయింట్ వద్ద నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మంచి చేకూరే కార్యక్రమాలను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. వీఎంసీ మీడియా పాయింట్ వద్ద శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. తొలి నుంచి కూడా నగర పాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశాలలో ఒకే పంథాను అవలంభిస్తూ.. సభను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మరీముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు నగర ప్రజలకు అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్నారన్నారు. 2014-19 మధ్యకాలంలో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు అన్ని స్థాయిలలోనూ అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం నాయకులు.. విజయవాడ నగర ప్రగతికి చేసింది శూన్యమని గుర్తుచేశారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో నగరంలో అభివృద్ధి పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ లలోనూ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. కుల, మతాలకతీతంగా సంక్షేమ ఫలాలు చివరి గడప వరకు చేరుస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరస్కరణకు గురైనా.. తెలుగుదేశం నాయకుల తీరులో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా జనవరి 1 నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ. 2,250 నుంచి రూ. 2,500 కి పెంచడమే ఇందుకు నిదర్శనమన్నారు. అదేవిధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు జగనన్న జన్మదిన కానుకగా సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమని.. ఇందులో ఎటువంటి బలవంతం లేదని స్పష్టం చేశారు. అదే చంద్రబాబు హయాంలో వాంబే కాలనీ హెచ్ బ్లాక్ కు సంబంధించి 105 మంది లబ్ధిదారులు వద్ద అసలు వడ్డీ కలిపి దాదాపు రూ. 65 వేల వరకు కట్టించుకొని పూర్తి హక్కులు కల్పించలేకపోయారన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటీఎస్ ద్వారా రూ. 20 వేలకే సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నట్లు తెలియజేశారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు పేదల గూర్చి కనీస ఆలోచన చేయకుండా.. మరలా ముఖ్యమంత్రి అయితే చేస్తానంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓటీఎస్ పై నాలుగు సార్లు ఫైల్ పంపించినా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పడేశారన్నారు. ఇవాళ మాట్లాడుతున్న వారు ఆ రోజు ఎందుకు డబ్బు కట్టించుకున్నారని ప్రశ్నించారు. విజ్ఞులైన ప్రజలు తెలుగుదేశం నాయకుల దుష్ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కనుక అర్హులైన ప్రతిఒక్కరూ ఈ రెండు రోజుల్లో ఓటీఎస్ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. టీడీపీ హయాంలో రూ. 65 వేలు చెల్లించిన లబ్ధిదారులకు కూడా కేవలం నామమాత్రం రుసుము రూ. 10 తో రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు గౌరవ శాసనసభ్యులు వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈనెల 21వ తేదీన పర్యావరణ హితంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. కావున ప్రతిఒక్కరూ తమ వంతుగా ఒక మొక్కను నాటి.. పచ్చదనం పెంపొందించే విధంగా వేడుకలలో పాలుపంచుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News