Breaking News

“ఆంధ్రా తార్నాక” – ఆర్టీసీ విద్యాధరపురం ఆసుపత్రి


విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు రవాణా సౌకర్యాలను అందించడంతో పాటు, ఉద్యోగుల ఆరోగ్యానికి కూడా పెద్ద పీట వేస్తూ వస్తున్నది. అవసరమైన వైద్య సౌకర్యాలు, మందులు, పరీక్షలు, చికిత్స\లతో పలు రకాల వైద్య సేవలను అందిస్తోంది.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో అయితే తార్నాకా హాస్పిటల్ ద్వారా లక్ష కు పైగా ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు సేవలు అందుతూ ఉండేవి.
విభజన అనంతరం ఆంద్రప్రదేశ్ లో విజయవాడ ప్రధాన కేంద్రంగా ఎ.పి.ఎస్.ఆర్.టి. సి 2016 జూలై లో పండిట్ నెహ్రు బస్సు స్టేషన్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో తన పరిపాలనా కార్యక్రమాలను ప్రారంభించి౦ది. ఆంద్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో మారుమూల డిపోల్లో పనిచేసే ఉద్యోగులలో ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లు వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాదుకు వెళ్లి ఈ వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. ఇందువలన 2-3 రోజుల విలువైన సమయం వృధా అయ్యేది. ఈ కారణంగా సిబ్బంది తిరిగి డ్యూటీలకు హాజరు కావడానికి కొంత సమయం పట్టేది తద్వారా ప్రయాణీకుల సేవలకు బస్సులను ఖచ్చితంగా నడపడంలో సమస్యలు తలెత్తేవి.
వారి ఇబ్బందులు తొలగించే క్రమంలో, తార్నాక ఆసుపత్రికి దీటుగా, ఇక్కడే విజయవాడ విద్యాధరపురంలో ఉద్యోగుల భాగస్వామ్యంతో 2.5 ఎకరాల విస్తీర్ణం కలిగిన స్థలంలో సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వసతులతో కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో “సెంట్రల్ హాస్పిటల్” నిర్మించబడి, 2017జూలై 4వ తేదీ నుండి వైద్య సేవలు ఇక్కడి నుండి ప్రారంభించబడినాయి.
50-పడకల సామర్ధ్యంతో నిర్మిపబడిన ఈ సెంట్రల్ హాస్పిటల్ ను తొలినాళ్లలో సిబ్బంది” ఆంధ్రా తార్నాక” గా ముద్దుగా పిలుచుకునేవాళ్ళు.
సంస్థలో పనిచేసే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి సుమారు 2.25 లక్షల మందికి వైద్య అవసరాలు తీర్చేందుకు అనుగుణంగా ఈ ఆసుపత్రి ద్వారా ఏర్పాట్లు చేయబడినవి. ఈ ఆసుపత్రి నిర్మాణానికి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి నెల వారి జీతం నుండి రూ.100/- చొప్పున 2 సంవత్సరాల పాటు స్వచ్చందంగా విరాళాలు అందివ్వడం అభినందించదగిన విషయం మరియు ఎంతో స్ఫూర్తిదాయకం.
ఉద్యోగులకు అవసరమైన మందులలో దాదాపు 95 శాతానికి పైగా మందులు ఇక్కడ విజయవాడ సెంట్రల్ హాస్పిటల్లో లభ్యమవుతున్నాయి. ఈ మందులు కూడా క్వాలిటీ కలిగినవి మరియు పలు పేరు గాంచిన బ్రాండెడ్ కంపెనీల ద్వారా సరఫరా చేయబడుతున్నాయి. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ నిపుణులైన వైద్యుల కన్సల్టేషన్ తో పేషంట్ల వ్యాధులను గుర్తించి తగు మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య పరీక్షలకు అవసరమైన ఎక్విప్మెంట్, మెషినరీ కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఇంకా విస్తృతమైన వైద్య సేవల అవసరం ఉన్నప్పుడు ఆ పేషంట్లను బయటి రెఫరల్ ఆసుపత్రులకు కూడా పంపడం జరిగేది.
ఈ హాస్పిటల్ లో ఉన్న వార్డులు, అత్యవసర విభాగాలు :
ఈ ఆసుపత్రి లో అత్యవసర పేషంట్ల కొరకు ఐ సి యు, క్యాజువాలిటీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి.
జనరల్ మెడిసిన్, సర్జరీ, ఆర్తోపెడిక్, గైనిక్, డెర్మటాలజీ , అఫ్తోల్మజీ, చెవి, ముక్కు, గొంతు, పీడియాట్రిక్స్, రేడియాలజీ, పాథాలజీ, డెంటల్ మరియు అనెస్తీషియా విభాగాలు అందుబాటులో ఉన్నవి.
ఇవే కాకుండా కార్డియాలజీ, ఆంకాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగాల కన్సల్టెంట్ వైద్యులను నెలలో రెండు పర్యాయాలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగినది.
అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు – డిజిటల్ ఎక్స్ రే, ఇ సి జి , స్కానింగ్ , లాప్రోస్కోపీ, ఫ్యాకో (కేటరాక్ట్ ఆపరేషన్ కోసం) కలర్ డాప్లర్, ఆటో అనలైజర్, సి ఆర్మ్. వంటివే కాకుండా అత్యవసర పరిస్థితిలో తక్షణ వైద్యానికి పనికొచ్చేలా 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఈ సెంట్రల్ హాస్పిటల్లో అందుబాటులో ఉంచారు. ఇవే కాకుండా అత్యాధునికమైన ఫిజియోథెరపీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది.
సామాజికసేవా కార్యక్రమాలలో సిబ్బంది భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ రెడ్ క్రాస్ సొసైటీ సాయంతో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి, సంస్థ సిబ్బంది నుండి రక్తం యూనిట్లు సేకరించి అత్యవసర సమయాలలో రక్తం అవసరమైన పేషంట్ల సరఫరాకు ఈ సెంట్రల్ హాస్పిటల్ సహకరిస్తున్నది.
అత్యవసర పరిస్థితులలో మెరుగైన వైద్యం కొరకు ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు అన్ని సౌకర్యాలతో ఒక అంబులెన్సును కూడా ఈ హాస్పిటల్ సమకూర్చుకున్నది.

వైద్య పరంగా ఏ విధమైన సమాచారం అయినా తెలుసుకునేందుకు వీలుగా 24 గంటల పాటు హెల్ప్ లైన్ నంబర్లు . 9494248897, 0866-2415206 ఏర్పాటు చేయబడినవి. అత్యవసర సమయంలో ఎవరైనా ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు ఈ హెల్ప్ లైన్ నంబరు కు కాల్ చేసి వారికి అవసరమైన వైద్య సలహాలు పొందవచ్చు.
దూర ప్రాంతాలల నుండి ఈ హాస్పిటల్ కు వచ్చే ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, సహాయకులు రాత్రి వేళలలో ఉండే విధంగా ఒక శాశ్వత భవనం కూడా స్థానిక పార్లమెంటు మెంబరు యంపీ ల్యాడ్స్ నిధుల సహకారంతో ఇక్కడ నిర్మింపబడినది.
ఈ సెంట్రల్ హాస్పిటలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల కొరకు 18 డిస్పె న్సరీలు, ఏర్పాటు చేసి వివిధ జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల ఆరోగ్యపరిరక్షణకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలోనే రాయలసీమ కేంద్రస్థాన ప్రాంతమైన కడపలో 20- పడకల ఏరియా ఆసుపత్రిని నిర్మించి అక్కడ కూడా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది. ఇక్కడ ఉద్యోగులకు అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.
సెంట్రల్ హస్పిటల్, కడప ఏరియా హాస్పిటల్ మరియు డిస్పె న్సరీ లు అన్నింటితో కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46 మంది డాక్టర్లు సేవలు అందిస్తున్నారు.
2000 మంది రిటైర్డ్ APSRTCఉద్యోగులు, వారి జీవిత భాగస్వామ్యుల వైద్య సేవల సౌకర్యార్ధం 18.12.2021న హైదరాబాదు తార్నాక రోడ్డు నం.1 లో 19వ వైద్యశాలను ఆర్టీసీ యం.డీ.  సి.హెచ్. తిరుమల రావు, IPS, ప్రారంభించారు. తద్వారా, హైదరాబాదులో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు విజయవాడ వరకు రావలసిన ఇబ్బంది తొలగిపోయింది.
అంతేకాక, ఆంద్రప్రదేశ్ జిల్లాలనుంచి ప్రతిరోజూ హైదరాబాదుకు వచ్చే సుమారు 2000 డ్రైవర్లు, కండక్టర్ సిబ్బందికి కూడా అవసర, అత్యవసర సమయాలలో కావలసిన వైద్యసదుపాయాలు ఈ హాస్పిటల్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసారు. అలాగే, హైదరాబాదులోని వివిధ ప్రాంతాలలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, రద్దీ, తదితర వ్యవహారాలను పర్యవేక్షించే నిమిత్తం ఉద్యోగరీత్యా బస్సు భవన్, బీ హెచ్ ఈ ఎల్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగులకు కూడా ఈ వైద్యశాల సేవలు ఏంతో ఉపకరిస్తాయి.
ప్రతి డిస్పెన్సరీ లోను ఉద్యోగుల కొరకు – పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ లతో పాటు ముఖ్యమైన రక్త పరీక్షలు అయినటువంటి లివర్, కిడ్నీ, లిపిడ్ ప్రోపోహిల్ (కొలెస్ట్రాల్) బ్లడ్ గూకోస్, ధైరాయిడ్ ప్రొపైల్ , కంప్లీట్ బ్లడ్ పిక్చర్ , వైడల్, మలేరియా, పారసైట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ మరియు స్టూల్స్ ఎగ్జామినేషన్ లు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా ఇ.సి.జి కూడా అందుబాటులోకి తీసుకువచ్చి ప్రతి డిస్పెన్సరీ లోను అక్కడ జరిపే పరీక్షల వివరాలు నోటీసు రూపంలో ప్రదర్శనకు ఉంచుతున్నారు.

“ఎ.పి.ఎస్. ఆర్.టి.సి.లో అత్యాధునిక వైద్య సేవలు అందించబడుతున్నాయి. ఇతర రోడ్డు రవాణా సంస్థలతో పోల్చి చూస్తే ఇక్కడ అందుతున్న వైద్య సేవలు చాలా సంతృప్తి కరంగా ఉంటున్నాయి.
మా సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఇతర సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్య సేవలు కూడా చాలా ముఖ్యమైనవి. వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తే సంస్థ నడక సాఫీగా సాగుతుంది. కాబట్టి సంస్థలో మొదటి నుండి కూడా సిబ్బంది వైద్యసేవలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది.
జనవరి 2020 నుండి ప్రభుత్వంలో విలీనమైన తర్వాత సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం ద్వారా EHS కార్డులు మంజూరు అయినప్పటికీ, సంస్థాపరమైన వైద్య సేవలు ఎప్పటిలానే అందిస్తూనే ఉన్నాము. అలాగే ఉచితంగా కన్సల్టేషన్, ఉచితంగా మందులు సరఫరా చేయబడుతున్నాయి ఈ సౌకర్యం ఇతర ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులకు అందుబాటులో లేవు. కేవలం ఆర్టీసీ తన ఉద్యోగులకు ఈ అదనపు ప్రయోజనాన్ని సమకూరుస్తున్నది.”
 -సిహెచ్. ద్వారకా తిరుమల రావు , ఐ పి ఎస్, RTC MD

“సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ లో భాగంగా అనేక చర్యలు తీసుకోబడుతున్నాయి. మొత్తం వైద్య సేవల ప్రాసెస్ కంప్యూటరీకరణ చేయబడినది. ఎప్పటికప్పుడు అవసరమైన ఆధునిక మెషినరీ, ఎక్విప్మెంట్ సమకూర్చుకుంటున్నాము. ఓ.పి కేసులు, ఇన్ పేషంటు కేసులు చూడడం ఒక పటిష్ట విధానంలో నిర్వహింపబడుతున్నవి. రోజుకు దాదాపుగా 200 మంది సిబ్బంది ఈ విద్యాధరపురం సెంట్రల్ హాస్పిటల్ కు వస్తున్నారు. రాష్ట్రం మొత్తంగా అన్ని హోస్పిటల్సులో రోజుకు 1700-2000 మంది ఈ హాస్పిటల్సు ద్వారా సేవలు పొందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలోను పరిశుభ్రత కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. రిటైరైన ఉద్యోగులకు, వారి భాగస్వాములకు ఇద్దరికీ కలిపి రూ. 4 లక్షల ఆర్థిక పరిమితి మేరకు వైద్య సేవలు అందించ బడుతున్నవి. సిబ్బంది ఆరోగ్య అవసరాలమేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది.”
– DVS అప్పారావు , చీఫ్ మెడికల్ ఆఫీసర్,
RTC సెంట్రల్ హాస్పిటల్, విధ్యధరాపురం, విజయవాడ

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *