-ఆహార భద్రత హక్కుకు భంగం కలిగించొద్దు
-నాణ్యత విషయంలో రాజీ పడొద్దు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆహార నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, ఆహార భద్రత హక్కుకు భంగం కలిగించవద్దని, జిల్లాలో ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కల్లెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరంలో జరిగిన జిల్లా ఆహార సలహా కమిటీ సమావేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మోహన్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సదస్సులో రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, మానవుడి ప్రాథమిక అవసరాలలో ఆహారం ప్రధానమైందని ఆరోగ్యవంతమైన జీవనానికి పోషక విలువలు కల ఆహారం అవసరం ఉందన్నారు. ఈ మధ్యకాలంలో ఆహారభద్రత భావన అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుందని ఆయన అన్నారు. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు.
పేదలకు ఆహారం అందించడం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నదని, జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, రేషన్ సరుకుల పంపిణీపై ఉన్నతస్థాయి అధికారులు తనిఖీలు తరచూ నిర్వహించాలన్నారు. పర్యవేక్షణ సరిగ్గా ఉంటేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం అందించే పాఠశాలల్లో నిరంతరం తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని సూచించారు. పిడిఎస్ బియ్యం సరఫరా, మహిళాభివృద్ది, శిశుసంక్షేమశాఖ కార్యకలాపాలు, అంత్యోదయ అన్నయోజన బియ్యం పంపిణీ, బియ్యం, ఇతర నిత్యావసరాలు నిల్వ ఉంచేందుకు గోదాముల సదుపాయం, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమటించకుండా, ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేలా రూపొందించబడిన ఆహార భద్రతా చట్టం అమలు కోసం, లబ్దిదారులకు తమతమ హక్కులను తెలియజెప్పి, ఆ దిశలో ప్రజలను, అధికారయంత్రాంగంను జాగృతం చేయడమే ఆహార భద్రతా కమిషన్ ముఖ్య ధ్యేయమని వివరించారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలందరికీ, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు రోజుకు ఒక సారి అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా ఆహారం సరఫరా చేసే అవకాశం ఉందని వారికి మంచి పౌష్టికాహారం అందించే దిశగా అంగన్వాడీ కేంద్రాలు మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఆహార భద్రతా చట్టం అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని మిషన్ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ సుహాసిని, సిడిపిఓ జయలక్ష్మి, బి సి వెల్ఫేర్ అధికారిణి, జిల్లాలోని పౌరసరఫరా అధికారులు, తహసిల్దార్లు, విద్యాశాఖాధికారులు, ఎంపిడిఓలు, అంగన్ వాడి అధికారులు, ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News