Breaking News

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వేటు తప్పదు…

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-ఎమ్మెల్యే చేతులమీదుగా లబ్ధిదారులకు సంక్షేమ బుక్ లెట్ల పంపిణీ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ పసుపుతోటలో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు సంక్షేమ బుక్ లెట్లను అందజేయడంతో పాటుగా.. సంక్షేమ క్యాలెండర్ పై విస్తృత అవగాహన కల్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ప్రధాన డ్రెయిన్‌లు, కాల్వలను పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగుకాలువలలో పేరుకుపోయిన సిల్ట్ ను తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట్ల కాలువలపై సిమెంట్ బిల్లలు ఏర్పాటు చేయాలన్నారు. మురుగునీటి పారుదల విషయంలో ఇంజనీరింగ్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో వార్డు సచివాలయాల వ్యవస్థను రూపొందించారని.. దానిని దృష్టిలో ఉంచుకుని సచివాలయ కార్యదర్శులంతా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డబ్బులు చెల్లించి మోసపోయిన పలువురు టిడ్కో లబ్ధిదారులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆశ్రయించారు. వారందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీనిచ్చారు. చంద్రబాబు హయాంలో నగరంలో 5,341 మంది నుంచి బలవంతంగా వసూలు చేసిన రూ. 16 కోట్లను.. వారం, పది రోజుల్లోగా తిరిగి చెల్లిస్తామన్నారు. ఇందుకోసం లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలను సేకరించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పలువురు చిరు వ్యాపారులతో ముచ్చటించారు, జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వారందరికీ సూచించారు.

అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పుల గూర్చి మాట్లాడే నైతిక అర్హత బీజేపీ నేతలకు లేదని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే ముందు కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుందో సమాధానం చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులను కేంద్ర ప్రభుత్వం చేసిన ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడే చేస్తోందని బీజేపీ నాయకులకు తెలియదా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలో టిడిపి, జనసేన సహా ఏ రాజకీయ పార్టీతో పొత్తుగా వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఆయనకు ఉన్న ప్రజాబలం దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేదని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగరంలో దాదాపు 50 కార్పొరేటర్ల సీట్లతో ప్రజలు వైఎస్సార్ సీపీని ఆశీర్వదించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు కనుగుల బాల, బెజ్జం రవి, పెరుమాళ్ల జయకర్, ఎస్.కె.బాబు, మానం వెంకటేశ్వరరావు, భోగాది మురళి, వెంకట్ రెడ్డి, గురవ శ్రీనివాసరావు, అంగిరేకుల విజయ్, జనార్ధన్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *