-అన్నదాతల సాగు, తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుల సాగు, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసినట్లు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. పోలవరం కాలువను పాతపాడు కండ్రిక వద్ద స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి ఆదివారం ఆయన సందర్శించారు. అన్నదాతల సాగునీటి వెతలను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మండిపడ్డారు. కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పోలవరం కాలువ నుంచి పాత కండ్రిక గ్రామంలోని చెరువుకు నీరు అందించే విధంగా 157.75 కి.మీ. వద్ద రూ. 35 లక్షల వ్యయంతో ఒక తూమును కూడా నిర్మించడం జరిగిందన్నారు. దీంతో పాటు నీటి సరఫరాకు ఎక్కడా అవాంతరాలు ఏర్పడకుండా గ్రామంలోని చెరువు వరకు పంపిణీ వ్యవస్థను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ మోటార్లు ఉన్నప్పటికీ కొన్నికొన్ని సందర్భాలలో నిరుపయోగంగా మారడంతో అన్నదాతలు తరచూ ఇబ్బందులకు గురవుతున్నారని మల్లాది విష్ణు తెలిపారు. కనుక సమస్య శాశ్వత పరిష్కారంతో పాటుగా.. కాలువ వెంబడి ఉన్న గ్రామాలకు తాగు, సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట వ్యవసాయ సొసైటీ బ్యాంకు చైర్మన్ రవీంద్ర రెడ్డి, సాగు రైతులు భీమిరెడ్డి శివరామిరెడ్డి, కొల్లు నాగిరెడ్డి, పిన్నిబోయిన కృష్ణ, డి.సుబ్బారావు, పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, పామర్తి వెంకయ్య, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News