Breaking News

స్వచ్ఛ నగరానికి మారు పేరు విజయవాడ నగరం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్ఛ నగరమంటే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది విజయవాడ అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్ న్యూ గిరిపురంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనితతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం గడపగడపకూ తిరిగి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యకమంపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పిస్తూ.. చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేశారు. క్లాప్‌ కార్యక్రమంలో భాగంగా గార్బేజ్‌ ఫ్రీ నగరంగా విజయవాడను తీర్చిదిద్దిడంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఫలితంగా పరిసర ప్రాంతాలు, వీధులు శుభ్రంగా ఉండి మురుగు, దోమలను నివారించవచ్చన్నారు. చెత్తను వేరు చేసి అందించేలా ఆయా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం స్థానిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. చిన్నారులందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఛార్జిషీట్ పై నిప్పులు చెరిగారు. 600కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదని తప్పించుకొని పారిపోయిన మోసగాడు చంద్రబాబు అని విమర్శించారు. అటువంటి చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు జగనన్న వెయ్యి రోజుల పాలనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు. స్కోచ్ సహా పలు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న అవార్డులను చూసి ఓర్వలేకనే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మహానేత వైఎస్సార్ పేరు వినగానే ఆరోగ్యశ్రీ సహా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జ్ఞప్తికి వస్తాయని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలాగే జననేత జగన్మోహన్ రెడ్డి పేరు వినగానే అమ్మఒడితో పాటు మరెన్నో 100 కి పైగా సంక్షేమ పథకాలు పేదలకు గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు అనగానే గుర్తుకు వచ్చే అటువంటి పథకం ఒక్కటైనా ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. ఖాళీ అవుతున్న టీడీపీ గూడును కాపాడుకునేందుకు చంద్రబాబు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. చార్జ్‌ షీట్‌ ఏదైనా వేయాల్సి వస్తే.. ముందుగా చంద్రబాబు వంచన పాలనపై వేయాలని మల్లాది విష్ణు అన్నారు.

డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రతి పేదవాడి హృదయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానం పదిలమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 24వ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి.. మిఠాయిలు పంచిపెట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగనన్న పాలన సాగిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. గడిచిన 3 ఏళ్ల పాలనలో ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారని తెలిపారు. అటువంటి నాయకుడు మరో మూడు దశాబ్దాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని మల్లాది విష్ణు చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ కొమ్ము చంటి, నాయకులు నైనావతి, బెల్లపు సత్యనారాయణ, ఇస్సాక్, కాజా శంకర్, వెంకట్రామిరెడ్డి, బి.భాస్కరరావు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *