సిద్ధాంతాలే ఊపిరిగా పురుడు పోసుకున్న పార్టీ వైఎస్సార్‌ సీపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సీఎం జగన్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది
-దేశ చరిత్రలోనే వైఎస్సార్ సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం
-ఇది కార్యకర్తల పండుగ: పూనూరు గౌతమ్ రెడ్డి
-గాయత్రి కన్వెన్షన్ సెంటర్ నందు ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ చరిత్రలోనే వైఎస్సార్‌ సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీతన్న పేటలోని గాయత్రి కన్వెన్షన్ హాల్ నందు వైఎస్సార్ సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేట్‌ కట్‌ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ పార్టీ శ్రేణుల నినాదాలు హోరెత్తించాయి. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలు రూపాంతరం చెందుతున్న ప్రస్తుత తరుణంలో దివంగత మహానేత వైఎస్సార్ దగ్గర నుంచి కానీ, సీఎం జగన్ నుంచి కానీ నేర్చుకోవలసింది ఎంతో ఉందని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏవిధంగా సేవ చేయాలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలో వారి నుంచే నేర్చుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా రాజశేఖర్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రతి ఒక్క అంశాన్ని మరుసటి రోజు చంద్రబాబు తూచా తప్పకుండా పాటించేవారన్నారు. ఆ మహానేత మాటకు అంత విలువ ఉండేదని మల్లాది విష్ణు అన్నారు. ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి తండ్రి లక్షణాలను పునికిపుచ్చుకున్నారన్నారు. 2014లో మూకుమ్మడిగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా.. వైఎస్సార్ సీపీ ఒంటరిగా వాటన్నింటినీ ఎదుర్కొందని మల్లాది విష్ణు అన్నారు. అయినా కూడా స్వల్ప తేడాతోనే ఓడిపోవలసి వచ్చిందన్నారు. కానీ 2019లో వైసీపీ ప్రభంజనం ముందు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నిలబడలేకపోయాయన్నారు. మంత్రులుగా పనిచేసిన వారు, ముఖ్యమంత్రి తనయుడు కూడా ఘోర పరాజయం పాలయ్యారన్నారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు కంచుకోట కుప్పంలో టీడీపీ బీటలు వారిందన్నారు. ఇప్పటికీ వైఎస్సార్ సీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సాహసించలేక.. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని మల్లాది విష్ణు అన్నారు.

వైఎస్సార్‌ ఆలోచన, స్ఫూర్తితో..
దివంగత మహానేత వైఎస్సార్‌ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించారని మల్లాది విష్ణు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆటుపోటులను ఓర్చుకుంటూ తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రను మహాయజ్ఞంలా పూర్తిచేశారన్నారు. సుధీర్ఘ పాదయాత్రలో ఎండనక వాననక నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి కష్టాలను తెలుసుకుని, ప్రజలకు తానున్నానన్న భరోసాను కల్పించారన్నారు.

సుపరిపాలనలో దేశంలోనే అగ్రగామి
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి పారదర్శక పాలన అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో చదువుల విప్లవం వచ్చిందని మల్లాది విష్ణు అన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా శిథిలావస్థకు చేరిన బడులకు మళ్లీ జీవకళను తీసుకొస్తున్నారన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం రికమెండేషన్లు పెరిగాయంటే.. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రపంచమే విలవిలపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఒక్క చిన్న విషయంలో కూడా వెనుకడుగు వేయలేద‌న్నారు. స్కోచ్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచేందుకు ఈ అంశాలన్నీ దోహదం చేశాయన్నారు.

పార్టీ బలోపేతానికి పునరంకితం అవుదాం
దేశంలో ఏ నాయకుడు ఇవ్వనంతగా.. సీఎం వైఎస్ జగన్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివిధ హోదాల్లో గుర్తింపునిచ్చారని మల్లాది విష్ణు అన్నారు. ఎమ్మెల్యేగా తన గెలుపు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఇలా గెలుపు ఎవరిదైనా.. ఆ విజయం జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త సొంతమని మల్లాది విష్ణు అన్నారు. రాబోయే రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉంటూ.. ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పు దోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తారని.. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ పార్టీ ప‌టిష్టత కోసం పున‌రంకిత‌మ‌వ్వాల‌ని పిలుపునిచ్చారు.

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కార్యకర్తల పండుగగా అభివర్ణించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే ఏ నిర్ణయం అయినా భావి తరాలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటురాని తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి పసిబిడ్డ యొక్క బంగారు భవిష్యత్తుకు జగనన్న భరోసాని కల్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే మరో 30 ఏళ్ళు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అని స్పష్టం చేశారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి మహిళా తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించేలా నమ్మకాన్ని సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కలిగించారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం మనదని కితాబిచ్చారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సీఎం జగన్‌ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇంఛార్జిలు, వివిధ కార్పొరేషన్ల డైరక్టర్లు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *