మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మెగా లోక్ అదాలత్ ను జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఏ. నరసింహమూర్తి ప్రారంభించారు. శనివారం మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ లో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా న్యాయ స్థానాలు ఉన్న ప్రదేశాల్లో ఈ రోజు జాతీయ మెగా లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 15,636 కేసులను గుర్తించామని, ఇందులో 14,783 మంది పార్టీలకు నోటీసులు జారీ చేయగా, 13,814 మంది పార్టీలు నోటీసులు అందుకున్నారన్నారు. బ్యాంకులు, బి ఎస్ ఎన్ ఎల్ వంటి సంస్థలు 3,800 వరకు ప్రీ లిటిగేషన్ కేసులు వేసి ఉన్నారని, అవన్నీ ఈ జాతీయ మెగా లోక్ అదాలత్ లో పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా 44 బెంచ్ లు ఏర్పాటు చేశామని, రాజీ మార్గమే రాజ మార్గమని, రాజీ పడాలనుకునే కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా సమయం, డబ్బు ఆదాతో పాటు తమ కేసులకు శాశ్వత పరిష్కారం పొందాలన్నారు. ఈ కేసుల పరిష్కారంలో సహకారం అందిస్తున్న న్యాయవాదులు, పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 9 వ అదనపు జిల్లా జడ్జి కె.సీతారామకృష్ణారావు, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఎం. రామకృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రాజారాం, బందరు డిఎస్పీ మాసూం బాషా, దిశా డిఎస్పీ రాజీవ్ కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.మెహర్ ప్రసాద్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News