మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో ఏర్పడే అదనపు లోడ్లు తట్టుకునేందుకు మరో దశాబ్దకాలం పాటు ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా రూ.6 కోట్ల 51లక్షల వ్యయంతో మచిలీపట్నం పరిధిలో అదనంగా 3 వ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఈహెచ్ టి సబ్ స్టేషన్ ఏర్పాటుకు పరిపాలన పరమైన ఆమోదం లభించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత వేసవిలోనే 90 మెగా వోల్ట్ యాంఫియర్ లోడ్ డిమాండ్ ఏర్పడిందని, ఆ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ ఏడాది వేసవికి ముందే అప్రమత్తమైనట్లు తెలిపారు. అధికారులు సానుకూలంగా స్పందించడంతో 132/33 కె వి మచిలీపట్నం సబ్ స్టేషన్ వద్ద ఉన్న2 x 50 మెగా వోల్ట్ యాంఫియర్ లోడ్ నుండి 3 x 50 మెగా వోల్ట్ యాంఫియర్ లోడ్ వరకు పెంపుదలకు అదనంగా 3 వ పవర్ ట్రాన్స్ ఫార్మర్ ఈ హెచ్ టి సబ్ స్టేషన్ లో ఏర్పాటుకు అనుమతిస్తూ గత నెల 29 వ తేదీన మంజూరు కావడం ఎంతో హర్షించదగ్గ పరిణామమన్నారు. మరో పదిహేను రోజులలో వీటి నిర్మాణంకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన తెలియచేస్తూ విద్యుత్ వినియోగదారులు అందరికీ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు నిరంతరాయంగా అందనున్నట్లు పేర్కొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 50 లక్షల రూపాయల విలువైన 12 ట్రాన్స్ ఫార్మర్లు, 40 లక్షల రూపాయల విలువైన 5 బ్రేకర్లు అదనంగా ఏర్పడిన విద్యుత్ సామర్ధ్యం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 33 ఫీడర్ల పని తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, సరఫరాలో అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయి సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని మంత్రి పేర్ని నాని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణారెడ్డి పలువురు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News