Breaking News

పితృభక్తికి శ్రీరాముడు ఆదర్శం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు


-జానకిరాముల పవిత్రబంధం అజరామరం
-అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామనవమిని పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని పలు రామాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు వైష్ణవాలయాలు శ్రీరామ నామంతో మార్మోగాయి. బీసెంట్ రోడ్డులోని రామాలయంలో 67వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ చేశారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, వరప్రేశనం(కన్యావరణం), మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. ఆ తరువాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేప‌ట్టారు. అనంతరం స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణఘట్టం పూర్తయింది. ఈ వేడుకలలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, సుపరిపాలనకు ఆద్యుడని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. సత్యం, ధర్మం, న్యాయమే మార్గాలుగా సర్వమానవ సంక్షేమ పాలన సాగించిన పరమ పావనమూర్తి అని తెలిపారు. రాముల‌వారి క‌ళ్యాణాన్ని లోక‌క‌ళ్యాణం కోసం నిర్వహిస్తార‌ని పేర్కొన్నారు. తల్లిదండ్రులను గౌరవించే ఉత్తమ సంప్రదాయాలను రామాయణం బోధిస్తుందన్నారు. పితృభక్తికి యుగయుగాలకు శ్రీరామచంద్రుడు ఆదర్శమని పేర్కొన్నారు. ఆ జగదభిరాముని అడుగుజాడల్లో నడుస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం భక్తులకు పానకం, వడపప్పులను తీర్థప్రసాదాలుగా అందించారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, ఉత్సవ కమిటీ సభ్యులు నీలం భానుమూర్తి, పోతిన రామ్ ప్రసాద్, బూర్లగడ్డ కృష్ణ కిషోర్, బొడ్డు శ్రీనివాసరావు, బుద్దా రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *