విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిని ఈదిన విజయవాడ స్విమ్మర్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని శనివారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయంగా ఇనుమడింపచేసిన స్విమ్మర్లు బి.అలంకృతి(13), స్పందన(19), టి.సాత్విక్ (15), కె.జార్జ్(16), కె.జాన్సన్(16), పి.రాహుల్(18) లను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కు చెందిన ఈ జట్టు ఈనెల 22 వ తేదీ అర్థరాత్రి ఒంటి గంటకు శ్రీలంక తీరం నుంచి ఈత ప్రారంభించి 9 గంటల 28 నిమిషాల 27 సెకన్లకు (30 కి.మీ. లక్ష్యం) రామేశ్వరంలోని ధనుష్కోటికి చేరుకున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. హెడ్ కానిస్టేబుల్, ఎన్.ఐ.ఎస్ కోచ్ తులసి చైతన్య శిక్షణలో ఈ జట్టు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని, అంతర్జాతీయంగా రాణించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ రమేష్, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
Prajavartha Online Telugu News