విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్లో శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద విశ్వజనీన ప్రార్థనా మందిర ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాత మందిరంలో మంగళహారతి, ధ్యానం, భజనలు నిర్వహించారు. అనంతరం కొత్త మందిరంలో లక్ష్మీ గణపతి హోమం జరిపారు. ఈ వేడుకలలో పూజ్య శ్రీమత్ స్వామి ఆత్మవిదానందజీ మహారాజ్ తో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి సేవలు ఆదర్శనీయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని నేటి తరాల వారికి అందించడంలో రామకృష్ణ సేవా సమితి పాత్ర ప్రశంసనీయమన్నారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వామి వివేకానంద స్ఫూర్తితో.. విద్యాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా సేవా సమితి చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వివేకానందుని బాటలో పయనించి.. యువత దేశ ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురికి జ్ఞాపికలను బహుకరించారు. కార్యక్రమంలో దాతలు దౌలత్ రామ్, రామకృష్ణ మిషన్ సభ్యులు హృదానంద మహారాజ్, వినిశ్చిలానంద, సేవియానంద, రామకృష్ణ సమితి నగర అధ్యక్షులు ఏ.వి.ఆర్.ప్రసాద్, సెక్రటరీ దుర్గాప్రసాద్, నాయకులు అవుతు శ్రీనివాస్ రెడ్డి, తొండెపు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News