విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణపురంలోని 217, 218 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి పర్యటించారు. తిరుమలరాజువీధి, చల్లపల్లివారి వీధి, రాణా ప్రతాప్ వీధి, సుమనం వారి వీధి, బ్రహ్మయ్యపంతులు వారి వీధి, సన్నిదానంవారి వీధి, కావూరివారి వీధి, మైలవరం జమీందార్ వారి వీధి, జి.ఎస్.రాజు రోడ్డు, శివరావు వారి వీధి, కాకరపర్తి వారి వీధులలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. సచివాలయాల పరిధిలో వివిధ పథకాలకు సంబంధించి అర్హుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పథకాలు వర్తించని వారికి జూన్ మాసంలో అందజేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా రోడ్లు, డ్రెయిన్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే నివేదికలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా నిత్యం పర్యవేక్షించాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శ పాలన అందిస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు. దేశ ప్రధాని, నీతిఅయోగ్ సైతం పలు సందర్భాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని కీర్తించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. చరిత్రలో నిలిచిపోయేలా సుపరిపాలన అందిస్తోన్న జగనన్న ప్రభుత్వంపై.. ప్రతిపక్షాలు చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రను పట్టించుకోని చంద్రబాబునాయుడు, తెలుగు దొంగల పార్టీ నేతలకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర గుర్తుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖను పరిపాలన రాజధానిని చేస్తుంటే వ్యతిరేకించిన నేతలంతా.. ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చెప్పుకునే చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో.. అక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. చివరకు కరోనా సమయంలోనూ హైదరాబాద్ లో దాక్కున్నారని దుయ్యబట్టారు. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కనుకనే 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పలు ఉప ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని వరుసగా ప్రజలు ఆశీర్వదిస్తూ వస్తున్నారన్నారు. అలాంటి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది ఒక్క ఛాన్స్ మాత్రమే అని ప్రతిపక్షనేత మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అత్యాచార ఘటనలలో బాధితులకు న్యాయం చేసే దిశ వంటి చట్టాలపై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు.. పలు కేసులలో దోషులుగా ఉన్న తెలుగుదేశం నాయకుల గూర్చి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర అప్పులపై తెలుగుదేశం నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేసినది, తెచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారనే వాటిపై చర్చకు రావాలని కోరారు. చివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ లో కూడా బకాయిలను పెట్టి వెళ్లిన పచ్చ నేతలు.. విద్యా దీవెన పథకం గూర్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కానీ ఈ ప్రభుత్వం వెచ్చించిన ప్రతి రూపాయికి ఆధార్ నెంబర్ తో సహా లబ్ధిదారుల లెక్క ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు చంద్రబాబు గానీ, పచ్చ మీడియా గానీ ఏమాత్రం సరితూగరని మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ గురునాథం, ఆర్.ఐ.(సివిల్ సప్లయిస్) లలిత, ఏఈలు వెంకటేష్, శ్రీనివాస్, డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు శిష్ట్లా రామలింగమూర్తి, శనగవరపు శ్రీనివాస్, మంత్రాలయం శివ, మధు, గోపాల్, సనత్, కమ్మిలి రత్న, చాంద్, చామర్తి మూర్తి, కనపర్తి కొండ, కూనపులి ఫణి, ఘంటసాల రమేష్, సత్యనారాయణ, త్రివేణి రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News