-వినియోగదారులకు భారీ షాక్
-మళ్లీ పెరిగిన సిలిండర్ ధర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్ ధరలను నియంత్రించడంలో విఫలమైందని, వంటింట్లో గ్యాస్ బండ సామాన్యుల గుండెల్లో గుదిబండలా మారిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. ఓవైపు పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతుంటే గృహ వినియోగ సిలిండర్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోవడం గోరు చుట్టుపై రోకలి పోటులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచడంతో 14 కేజీల సిలిండర్ ధర రూ.1052కి చేరిందని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.102.50 పెంచటం వల్ల రూ.2253గా ఉన్న గ్యాస్ బండ రూ.2355.50కి చేరిందన్నారు. ఈ నెల 1న పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ.2,460 నుంచి 2,563.50కి చేరిందని, మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దీంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడిందని, నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే రూ.3,000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News