విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్, డిఆర్ఓ కె. మోహన్ కుమార్, హౌసింగ్ అధికారులతో కలెక్టర్ ఢిల్లీ రావు కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతోందని, ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి స్టేజి అప్డేషన్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్ లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేసేలా చూడాలని, సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యం ఇళ్ల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేటాయించిన లక్ష్యాలను చేరుకునేలా పని చేయాలని, లబ్ధిదారులకు కూడా నిర్మాణాలపై అవగాహన కల్పించాలన్నారు. జగనన్న హౌసింగ్ లేఔట్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో 82,430గృహాలు మంజూరయ్యాయని వీటిలో 47,192 గృహాలు బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని వీటిని బేస్మెంట్ స్థాయికి తీసుకు రావాలన్నారు. బేస్మెంట్ లెవెల్ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న 8,878 గృహాలను రూప్ క్యాస్టింగ్ స్థాయికి తీసుకురావాలన్నారు. ఇంకనూ ప్రారంభం కాని గృహాలను లబ్ధిదారులతో ప్రారంభింప చేయాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి వారు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని కలెక్టర్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వీ శ్రీదేవి, హౌసింగ్ ఈఈ బి ఎస్ రవికాంత్, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News