-పరిశ్రమలకు వారంలో ఒక రోజు శెలవు సడలింపు
-పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా
-రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ కోత విషయంలో పరిశ్రమలకు సడలింపు ఇస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు మరియు 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి పరిశ్రమలకు అవకాశం కల్పించడం జరిగిందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, గనులు మరియు భూగర్బ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 235 మిలియన్ యూనిట్ల నుండి 186 మిలియన్ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను పెంపొందించే విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యుత్ వినియోగం పై సోమవారం సమీక్ష చేయడం జరిగిందని, గతంలో రోజుకి 235 మిలియన్ యూనిట్ల దాకా విద్యుత్ వినియోగం ఉండటంతో అందుకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి కాకపోవడంతో ప్రజలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేసేందుకై బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను కొనుగోలు చేసి మరీ సరఫరా చేయడం జరిగిందన్నారు. విద్యుత్ కొరత నేపథ్యంలో పరిశ్రమలకు 50 శాతం కోత విధిండం జరిగిందని, వారంలో ఒక రోజు శెలవును కూడా ప్రకటించడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం విద్యుత్ వినియోగం రోజుకు 186 మిలియన్ యూనిట్లకు తగ్గిన నేపథ్యంలో విద్యుత్ కోత విషయంలో పరిశ్రమలకు సడలింపు ఇస్తూ వారంలో అన్ని రోజుల పాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు మరియు 70 శాతం మేర విద్యుత్ వినియోగానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా నిన్న రాత్రే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సదరన్, ఈస్ట్రన్ , సెంట్రల్ డిస్కంలకు అనుమతి నిచ్చిందని మంత్రి తెలిపారు. విద్యుత్ కోత విషయంలో ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్ల నుండి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయని, వాటన్నింటి పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని ఆక్వా కల్చర్ కు సంబందించిన ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్లకు, ఐస్ ప్యాక్టరీలకు, కోల్డు స్టోరేజ్ లకు శతశాతం విద్యుత్ సరఫరా చేసేందుకు మరియు ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యానిట్లకు ఎటు వంటి విద్యుత్ కోత లేకుండా చూసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మన రాష్ట్రంలో కంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలను పెద్ద ఎత్తున విధించడం వల్ల పరిశ్రమలను మూసివేసుకోవడం జరిగిందని, అయితే అటు వంటి పరిస్థితులు మన రాష్ట్రంలో తలెత్తలేదన్నారు. గృహ వినియోగానికై ఎటు వంటి కోత విధించకుండా విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా నేడు మనం ఒక అడుగు ముందుకు వేసి పరిశ్రమలకు 70 శాతం మేర, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాటి అనుబంధ యూనిట్లకు 100 శాతం మేర విద్యుత్ సరఫరాను చేయడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ, శ్రద్ద, సహకారంతోనే రాష్ట్రంలో ఎటు వంటి విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. రైతులకు కూడా 9 గంటల పాటు పగటి పూటే విద్యుత్ సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. ఇటు వంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాలలో లేవని, విద్యుత్ సరఫరా విషయంలో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు.
పంపు సెట్లకు మీటర్లు బిగించడం వల్ల మూడో వంతు రాయితీ పొదుపు…
విద్యుత్ సరఫరాలో నష్టాన్ని, చౌర్యాన్ని నియంత్రించేందుకు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించే పైలెట్ ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు అమల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో 28 వేల పంపుసెట్లకు మీటర్లు బిగించడం జరిగిందని ఫలితంగా ప్రభుత్వం అందజేసే రాయితీలో సుమారు మూడో వంతు అంటే 33.15 శాతం మేర పొదుపు అవ్వడం జరిగిందన్నారు. రైతులకు సంబందించి రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని, వీటన్నింటికీ సుమారు రూ.10 వేల కోట్ల మేర విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు. మీటర్లును ఈ పంపు సెట్లు అన్నింటికీ బిగించడం వల్ల ప్రభుత్వం అందజేసే రూ.10 వేల కోట్ల విద్యుత్ రాయితీలో మూడో వంతు పొదుపు అవుతుందనే అశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు రానున్న ఆరు మాసాల్లో మీటర్లను బిగించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎ.పి.జన్కో ఎం.డి. బి.శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News