-23 వ వార్డు 97వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
-జోరు వానలోనూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పర్యటన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్ – 97 వ వార్డు సచివాలయం పరిధిలోని వీధులలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగింది. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, పార్టీ శ్రేణులతో కలిసి అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరించారు. డోర్నకల్ రోడ్డు నుంచి ప్రారంభమై గోపరాజు రామచంద్రరావు వీధి, పీసపాటి వారి వీధి, తాడేపల్లి వారి వీధి, కాళేశ్వరరావు రోడ్డు, డోర్నకల్ రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 895 గృహాలలో, రెండో రోజు 375 గడపలను సందర్శించారు. గోపరాజు రామచంద్రరావు వీధిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. డోర్నకల్ రోడ్డులో సైడ్ కాల్వలలో ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలన్నారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల సౌకర్యార్థం ఆస్తిపన్ను చెల్లింపులకు సంబంధించి అదనంగా 6 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని.. వాటిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 120 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు వెల్లడించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 25,263 మందికి ప్రతినెలా రూ. 5.68 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 28,834 మందికి రూ. 43.25 కోట్లు., విద్యాదీవెన ద్వారా 6,989 మందికి రూ. 13.97 కోట్లు., ఈబీసీ నేస్తం ద్వారా 1,947 మందికి రూ. 2.92 కోట్లు., వైఎస్సార్ ఆసరా ద్వారా 31,100 మందికి రూ. 27.96 కోట్లు., కాపునేస్తం ద్వారా 1,869 మందికి రూ. 2.80 కోట్లు., సున్నావడ్డీ ద్వారా 4,032 మందికి రూ.5.31 కోట్లు., జగనన్న తోడు ద్వారా 3,020 మందికి రూ.3.02 కోట్లు., చేయూత ద్వారా 6,232 మందికి రూ. 11.68 కోట్లు., వాహనమిత్ర ద్వారా 2,200 మందికి రూ. 2.20 కోట్లు., చేదోడు ద్వారా రూ. 10 వేల చొప్పున 420 మంది రజకులకు రూ. 42 లక్షలు., 956 మంది దర్జీలకు రూ. 95 లక్షలు., 194 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 19 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు.
దిశ యాప్ పై విస్తృత అవగాహన
మహిళల రక్షణకు దిశ యాప్ ను ప్రవేశపెట్టి దాదాపు 900 మంది మహిళలను రక్షించిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని మల్లాది విష్ణు అన్నారు. ఆడబిడ్డలకు అత్యవసర సమయాలలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎస్వోఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వస్తారని తెలియజేశారు. కనుక డివిజన్ లోని ప్రతి ఒక్క మహిళ, యువతి, విద్యార్థిని కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం మహిళ పోలీసులు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ ప్రచారం నిర్వహించి వారిలో అవగాహన పెంచాలన్నారు. ఉమెన్ పోలీసుల వద్ద సచివాలయ పరిధిలోని ప్రతిఒక్క మహిళకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలన్నారు. విద్యార్థినులు, ఉద్యోగస్తులు, గృహిణులు ఇలా కేటగిరీల వారీగా సమాచారాన్ని పొందుపరచుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో సచివాలయ సిబ్బంది స్థానిక మహిళలు, యువతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. 50 మందికి యాప్ ను డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని తెలియజేయడంతో పాటు.. వినియోగించే ప్రక్రియను వివరించారు.
దిమ్మె తొలగింపుపై హర్షం
తాడేపల్లి వారి వీధిలో ఎన్నో రోజులుగా రహదారికి అడ్డుగా ఉన్న సిమెంట్ దిమ్మెతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి రావడంతో తక్షణమే తొలగించాలని ఆదేశించారు. దీంతో వీఎంసీ సిబ్బంది ఆఘమేఘాల మీద దిమ్మెను క్రేన్ సాయంతో తొలగించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సమీపంలో ఎన్నికలు లేకపోయినప్పటికీ బాధ్యతగా, జవాబుదారీతనంతో ఇంటింటికీ తిరిగి అన్ని వర్గాల ప్రజల సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. విజయం మాత్రం వైఎస్సార్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక, బద్వేలు ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2024లోనూ పునరావృతం అవుతాయన్నారు. ఎల్లో మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్ని తప్పుడు సంకేతాలు పంపించినా.. ప్రజలు పచ్చ మీడియాను, చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా.. అది తన ఆలోచన అనుకునే ఫోబియాతో ప్రతిపక్ష నేత బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వం నచ్చకనే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి.. వైఎస్సార్ సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకున్నారన్నారు. అటువంటి ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచేందుకు రూ. లక్షా 50 వేల కోట్ల సంక్షేమాన్ని నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు.
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి సోమువీర్రాజుకి లేదని మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఎవరి పక్కన చేరాలో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నారని వ్యాఖ్యానించారు. హిందు ధర్మ పరిరక్షణకు బీజేపీకి మించి వంద రెట్లు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్వేదీ రథం దగ్ధమైన ఘటనలో సీబీఐ దర్యాప్తుకై రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. అందుకు కేంద్రంచే ఆమోదింపచేయించలేని చేతగాని బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉండటం బాధాకరమన్నారు. మీరా వైఎస్సార్ సీపీని విమర్శించేదని దుయ్యబట్టారు. పోలవరం, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. తిరుపతి సాక్షిగా ప్రత్యేక హోదాకు ఆనాడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి సమాధి కట్టాయని గుర్తుచేశారు. పైగా రాష్ట్రంలో జరుగుతోన్న సంక్షేమం, అభివృద్ధి బీజేపీ చలవేనంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులనే.. దామాషా ప్రకారం తిరిగి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. ఇవిగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయించిన నిధులు ఏమైనా ఉంటే సోము వీర్రాజు సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని స్పష్టం చేశారు.
మీ అనురాగానికి, ఆప్యాయతకు కృతజ్ఞుడిని
రెండు రోజుల పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమానురాగాల పట్ల ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. మీరు చూపిన అభిమానం తనకు మరింత బలాన్ని ఇచ్చిందన్నారు. ప్రతి అడుగులో ప్రజల ఆప్యాయత, మద్దతు కనిపిస్తోందన్నారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయ పరిధిలో ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, ఏ.ఎం.ఓ.హెచ్. రామకోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ బాలాజీ, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీ, నాయకులు వెన్నం రత్నారావు, శేషన్ మురళి, దమ్మాల మల్లి, ఆత్మకూరి అప్పారావు, నిఖిల్ సూద్, రామ్ పిఎస్ఆర్, కె.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News