ఓర్వకల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓర్వకల్లు లోని (రాతి ఉద్యానవనం) రాక్ గార్డెన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్.కె.రోజా సందర్శించారు. ఈ సంధర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ కర్నూలు జిల్లా, ఓర్వకల్లు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు ఏర్పడ్డాయని, ఇది పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉందని మంత్రి రోజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాతి రెస్టారెంట్, బోటింగ్, కేవ్ మ్యూజియం, పిక్నిక్ స్థలాలు, వసతి కోసం హరిత రిసార్టు పర్యాటకులకు అందిస్తున్నామని అన్నారు. పర్యాటకులకు మరిన్ని వసతుల కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీటిని సందర్శించడానికి అనువైన సమయంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఇక్కడ ఉన్న డిస్నీ బర్డ్ వాచింగ్ స్పాట్ లో వివిధ రకాలైన పక్షుల శబ్దాలను, వాటి గమనాన్ని వీక్షించవచ్చు. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిలలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇక్కడ సినిమాలు కూడా చిత్రీకరించరని, చిత్ర పరిశ్రమలు ఈ ప్రదేశాన్ని మరింతగా ఉపయోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా తెలిపారు. సహజ సిద్ధ పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేస్తాం. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. రాష్ట్రానికి పర్యాటక రంగం ప్రథమ స్ధానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆదేశాలను అమలు చేస్తాం అని మంత్రి రోజా తెలిపారు. ఈ పర్యటనలో మంత్రి రోజా పర్యాటక శాఖ అధికారులు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులతో కర్నూల్ రీజనల్ టూరిజం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష లో పాణ్యం ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. రీజనల్ గా వున్న పర్యాటక ప్రదేశాల వివరాలను అధికారులని మంత్రి అడిగి తెలుసుకున్నారు. పర్యాటక అభివృద్ధి కోసం సూచనలు సలహాలు మంత్రి అధికారులకి తెలియచేసారు.
Prajavartha Online Telugu News