Breaking News

బుతుక్రమం సమయంలో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుతుక్రమం సమయంలో పరిశుభ్రత పాటించడంపై దృష్టి సారించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బుతుక్రమం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో పరిశుభ్రతపై మునిసెఫ్‌ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్‌ డిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రుతుక్రమం అనేది సాధారణ జీవప్రక్రియ అన్నారు. పునరుత్పత్తి వయసులో ఉండే అందరు స్త్రీలకు ఇది మామూలుగా సంభవిస్తుందని పేర్కొన్నారు. రుతుక్రమం గురించి మాట్లాడటానికి ఎవరూ బిడియ పడాల్సిన అవసరం లేదని అన్నారు. దేశంలో పాఠశాలల్లో ఆడపిల్లలకు అనుకూలమైన వసతులులేక 28 శాతం మంది బడి మానివేస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయని అన్నారు. పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు, శానిటరీ ప్యాడ్స్‌ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందరికీ రుతుక్రమం పై అగాహన కల్పించాలని తద్వారా పాఠశాల పరిశుభ్రత, నిర్వహణతో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. తండ్రి, సోదరులు ఆడపిల్లలకు, మహిళలకు రుతుక్రమంపై సమగ్రమైన సమాచారాన్ని నైపుణ్యాలను అందించాలని పిలుపునిచ్చారు. అనవసర అపోహలతో ప్రతికూలమైన హానికరమైన సామాజిక నిబంధనలను ఎదుర్కొంటున్నారని అన్నారు. నెలసరి సమయంలో పాటించవలసిన పరిశుభ్రతా పద్దతుల గురించి అవగాహన లేకపోవటం వలన అనేక మంది వివిధ అనారోగ్యాలకు గురి అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. రుతుక్రమం సమయంలో శానిటరీ ప్యాడ్స్‌ వాడాలని, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి లేదా బాగా తడిగా అనిపించినప్పుడు పాడ్స్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సానిటరీ ప్యాడ్‌ మార్చుకున్నప్పుడు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని పాడ్స్‌ ఎక్కడపడితే అక్కడ పడివేయకుండా చెత్తకుండీలో వేయాలని లేదా ఇన్సినిరేటర్‌లో కాల్చివేయాలని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌ మాట్లాడుతూ అమ్మాయిలకు 8 నుండి 18 సంవత్సరాల వయస్సులో మొదటి రుతుక్రమం వస్తుందన్నారు. ఈ వయసులో అమ్మాయిల శరీరంలో మార్పులు జరుగుతాయని శరీరంలో వస్తున్న మార్పులను గమనించి ప్రతి నెల రుతుక్రమం తేదీలను గుర్తించుకోవాలని తద్వారా పరిశుభ్రతపై చర్యలు తీసుకోవచ్చని సూచించారు. నెలసరి సమయంలో విధిగా స్నానం చేయడం ఉత్తమమని, నెలసరి సమయాల్లో ఐరన్‌, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే మంచి సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలసరి సమయంలో నీరు ఎక్కువగా తాగాలని దాని వల్ల నొప్పి కడుపు ఉబ్బరం తగ్గుతాయని పేర్కొన్నారు. సులభమైన వ్యాయామాలు చేయడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి ఉండదని వివరించారు. నెలసరి సమయంలో కొంత శారీరక బలహీనత ఉండే అవకాశం ఉందని ఎక్కువ శారీరక శ్రమ ఉండరాదు అనే ఉద్ధేశంతో కొన్ని నిబంధనలు పాటించడం జరుగుతోందని చెప్పారు. సమాజంలో కొంతమంది అపోహతో అపవిత్రంగా భావించడం జరుగుతుందని ఇది అవసరం లేదని అన్నారు. రుతుక్రమం సమయంలో సంస్కృతిక కార్యక్రమాలు ఇతర సమావేశాల్లో మామూలుగా పాల్గొనవచ్చని సూచించారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి. ఉమాదేవి, అజీమ్‌ ప్రేమ్‌జి ఫౌండేషన్‌ మాస్టర్‌ట్రైనర్‌ ఉమామహేశ్వరరావు, ఎస్‌బిసిసిసెల్‌ కో`ఆర్డినేటర్‌ ఎన్‌ లీలా శాంతి, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *