విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓ మనిషి ప్రాణరక్షణకై మానవీయ ధర్మాన్ని ప్రదర్శించిన జంగారెడ్డి గూడెం RTC డిపో డ్రైవర్, కండక్టర్లను అభినందిద్దాం. 26-5-2022న రాత్రి ప.గో.జిల్లాలో ఓ అమానవీయ దృశ్యం తటస్థపడింది. కళ్లెదుట ఓ ప్రాణం విలవిలాడుతోంది. అదే సమయానికి ఆ దారిన వెళ్లే జంగారెడ్డిగూడెం RTC డిపో బస్ డ్రైవర్ తన బస్ ని ఆపారు. బస్ లో ప్రయాణీకులు కూడా అత్యంత మానవీయతతో స్పందించారు. ఫలితంగా విలవిల్లాడే ఓ మానవ ప్రాణం ప్రమాదం నుండి బయట పడింది. జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే పల్లె వెలుగు బస్ 26.౦5.2022 రాత్రి సరిగ్గా 9-40 టైం కి జంగారెడ్డిగూడెం నుండి బయలు దేరింది. అది జంగారెడ్డిగూడెం RTC డిపో బస్ నెంబర్ AP16 TH 8567. బస్ వేగివాడ దాటింది. (చక్రాయగూడెం దాటిందని ప్రయాణీకుల్లో ఒకరి మాట) రాత్రి 10-45 సమయం. డ్రైవర్ బస్ ఆపారు. బస్ కి ముందు అదే దారిన వచ్చే కొబ్బరి కాయల లారీ బోల్తా పడింది. అది ఒకట్రెండు నిమిషాల క్రితం మాత్రమే. బోల్తా పడిన లారీ ఇంజిన్ ఇంకా ఆగిపోలేదు. బస్ లో ఏడెనిమిది మంది స్త్రీలు సహా సుమారు పాతిక మంది ప్రయాణీకులు వున్నారు. వెంటనే బస్ దిగిపోయారు. ఓ విషాద దృశ్యం అందరినీ బాధకు గురిచేసింది. బోల్తా పడిన లారీ కేబిన్ లో డ్రైవర్ ఇరుక్కు పోయాడు. అంతా చిమ్మ చీకటి. ప్రయాణీకులు ఫోన్ లైట్లు వెలిగించారు. బస్ ప్రయాణీకుల్లో చురుకైన యువకులు కొందరు తక్షణమే రంగంలోకి దిగారు. వారికి ప్రయాణీకుల్లో పెద్దవాళ్ళ నుండి కూడా పూర్తి ప్రోత్సాహం లభించింది. తొలుత కేబిన్ నుండి డ్రైవర్ ని బయటకు తీయడం అసాధ్యం అనిపించింది. JCB వస్తే తప్ప సాధ్యం కాదనేది తొలుత ఏర్పడ్డ అభిప్రాయం. ఐతే ఒక ఐదారుగురు యువకుల పట్టుదల, నైపుణ్యం ఎదుట పైన పేర్కొన్న ప్రాధమిక అభిప్రాయం వీగిపోయింది. ముప్పావు గంట యుద్ధప్రాతిపదికన శ్రమించారు. ఎట్టకేలకు ఆ డ్రైవర్ ని కేబిన్ నుండి సురక్షితంగా బయటకు తీయగలిగారు. అతడు ఇరవై ఏళ్ళ యువకుడు. మహారాష్ట్రకు చెందిన డ్రైవర్! అతడికి తెలుగు భాష రాదు. అతడి బాడీ నలిగిపోవచ్చు. కానీ ప్రమాదానికి గురికాలేదు. ఆ రాత్రి 10-45 నుండి 11-30 వరకు ఉత్కంఠభరితంగా ఓ మనిషి ప్రాణ పరిరక్షణ కోసం ముప్పావుగంట జరిగిన మానవీయ కృషి ఆదర్శప్రాయమే కాదు, మార్గదర్శక మైనది కూడా! కేబిన్ ని ఊడబీకితే తప్ప అందులో ఇరుక్కు పోయిన లారీ డ్రైవర్ బయటకు రాని పరిస్థితి ఉంది. బస్ మానాన బస్ వెళ్ళిపోయి ఉంటే అంత అర్ధరాత్రి ఆ దారిన వెళ్లే వాహనాలు ఏవీ పట్టించుకునే అవకాశం లేదు. బోల్తా పడ్డ లారీలో క్లీనర్ లేడు. డ్రైవర్ ఇరుక్కున్న విషయం దారిన వెళ్లే వాహనదార్లు ఎవరూ ఆ చిమ్మ చీకట్లో గుర్తించలేరు. తెల్లవార్లూ అదే దుస్థితిలో ఉండి ఉంటే మానసిక వత్తిడికి ఏమై వుండేవాడో! కేబిన్ నుండి బయటకు తీయడానికి అవసరమైన కొన్ని పనిముట్లు అదే లారీ నుండి యువకులు తీసి ఉపయోగించారు. బస్ డ్రైవర్ రెంచీలు వగైరా కొన్ని పనిముట్లు ఇచ్చారు. బస్ ప్రయాణీకులు ఉండడంతో టూ వీలర్స్ పై వెళ్లే స్థానిక పరిసర గ్రామాల ప్రయాణీకులు కొందరు కూడా అర్ధరాత్రి ఆగారు. వారు కూడా సహకరించారు.
ప్రయాణీకులు అటు పోలీసులకూ, ఇటు 108 కీ ఫోన్లు చేశారు. అక్కడ దొరికిన పత్రాల్ని చూసి ఆ కొబ్బరి లోడ్ బయలు దేరిన సమీప ప్రాంత ఏజెంట్ కి కాల్ చేశారు. అరగంటలో వస్తామని హామీ ఇచ్చారు. అతడిని కేబిన్ నుంచి బయటకు తీసిన సమయానికి 108 వాహనం వచ్చింది. ఆ డ్రైవర్ ని చికిత్స కోసం తీసుకెళ్లింది. బస్ ముప్పావుగంట తర్వాత బయలుదేరింది. ఒక విషాదకర కన్నీటి గాథ సుఖాంతమైనది. ప్రధానంగా బస్ ప్రయాణీకుల్లో వున్న ఓ అరడజను మంది నిపుణ యువకుల సేవా కృషి ఫలితమిది. ఐతే RTC డ్రైవర్, కండక్టర్ గార్ల సహకారంతోనే ఇది సాధ్యమైనది. అర్ధరాత్రి సైతం ఒక్క ప్రయాణీకుడు కూడా ఆ డ్రైవర్ ని వదిలేసి వెళ్లిపోదామని బస్ డ్రైవర్ పై వత్తిడి తెలీదు. ఏడెనిమిది మంది స్త్రీలు సైతం ఆ మాట మాట్లాడలేదు. పసిపిల్లాళ్ల తల్లులు ఉండి కూడా అలాంటి ఓ మాట మాట్లాడలేదు. అదో గొప్ప విశేషమే! ఇలాంటి మానవీయ ప్రతిస్పందన వల్ల ఎక్కడో మహారాష్ట్రకి చెందిన ఒక డ్రైవర్ మానవ ప్రాణం కాపాడబడింది. ఇది ఎంతో గర్వించదగ్గది.
మహారాష్ట్రలో డ్రైవర్ బంధుమిత్రులతో పాటు లారీ డ్రైవర్ కమ్యూనిటీ లో ఇదో ఆదర్శ సేవా సంఘటనగా ప్రచారం అవుతుంది. సుదూరపు ఆంధ్రా రోడ్లపై తెలుగు ప్రజల సేవా కృషి వల్ల సురక్షితంగా బయటపడ్డ సంఘటన ప్రాచుర్యం పొందుతుంది. ఇది ఐదారుగురు యువ నిపుణ నేర్పరుల చొరవ వల్లనే జరిగివుండొచ్చు. కానీ జంగారెడ్డిగూడెం డిపో డ్రైవర్, కండక్టర్ ల చొరవ, మానవీయ ప్రతిస్పందన లేకుండా ఇది సాధ్యం కాదు. వారు బస్ ని ఆపివుండక పోతే సాధ్యమయ్యేది కాదు. అంతెందుకు, పావుగంట లేదా అరగంట విఫల కృషి తర్వాత ఒకవేళ ఆ డ్రైవర్ ప్రాణాన్ని మనం కాపాడలేమనే నిరాశకు గురై బస్ వెళ్తుంది ప్రయాణీకులు వచ్చి బస్ ఎక్కడి అని RTC డ్రైవర్, కండక్టర్ గార్లు అదేశించి ఉంటే ఆ లారీ డ్రైవర్ ప్రాణం నిలిచేది కాదేమో! ఈ కారణంగానే జంగారెడ్డిగూడెం RTC డిపో డ్రైవర్, కండక్టర్ ల్ని అభినందిద్దాం. పై సంఘటన తాలూకు పూర్తి వివరాలు తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సి హెచ్ .ద్వారకా తిరుమల రావు, IPS , సోమవారం ఆ బస్సు సిబ్బంది B..భరత్, స్టాఫ్ నంబరు 045266, హైర్ బస్సు డ్రైవర్, S. నారాయణ, స్టాఫ్ నంబరు 700862 కండక్టర్లను, హెడ్ ఆఫీసు ఆర్టీసీ హౌసు కు పిలిపించి, జోనల్ ఎగ్జి క్యుటివ్ డైరెక్టర్లు, అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారుల మీటింగులో వీరిని ప్రశంసా పత్రము అందజేసి, రు.1000/- నగదు బహుమతితో సత్కరించడం జరిగింది. ఇదే స్పూర్తిని తోటి సిబ్బంది అందరూ అలవర్చు కోవాలని ద్వారకా తిరుమల రావు, IAS ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.
Prajavartha Online Telugu News