-పరీక్షకు హాజరు కానున్న13,785 మంది అభ్యర్థులు…
-58 మంది విభిన్న ప్రతిభావంతులు..
-పరీక్షల నిర్వహణకు 33 కేంద్రాలు ఏర్పాటు…
-1,332 మంది ఇన్విజిలేటర్లు ఏర్పాటు..
-33 మంది వెన్యూ సూపర్వైజర్లు, 94 మంది అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు వెన్యూ సూపర్ వైజర్లు, అసిస్టెంట్ వెన్యూ సూపర్ వైజర్లు, అసిస్టెంట్ కోఆర్డినేటింగ్ సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను జూన్ 5వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని, ఈ పరీక్షలకు 13,785 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9 :30 గంటల నుంచి 11 : 30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 33 పరీక్షా కేంద్రాలలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. పడమట కెబిసి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో విభిన్న ప్రతిభావంతుల పరీక్ష రాసేందుకు ప్రత్యేక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జూన్ 4వ తేదీ మరియు 5వ తేదీన కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు 33 మంది వెన్యూ సూపర్ వైజర్లు, 94 మంది అసిస్టెంట్ వెన్యూ సూపర్ వైజర్సు నియమించామన్నారు. ఆరుగురు జిల్లాస్థాయి అధికారులు అసిస్టెంట్ కోఆర్డినేటింగ్ సూపర్ వైజర్లగా నియమించడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని, సిటింగ్ ఏర్పాటు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. వెన్యూ కేంద్రాల్లో జామర్స్ ఏర్పాటు ముందుగానే పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని వెన్యూ కేంద్రాలను పరిశీలించి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయా అనేది పరిశీలించాలన్నారు. ప్రతీ కేంద్రంలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా బస్సుల సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష సమయాలలో విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్తు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాల్లో కి తీసుకు రాకూదని కలెక్టర్ అన్నారు. కోవిడ్ గైడ్ లైన్స్ పాటించాలని, మాస్కులు అందరూ ఉపయోగించాలని, ఇందుకోసం వెన్యూ కేంద్రాల్లో మాస్కులు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జిల్లా రెవెన్యూ అధికారి,పరీక్షల కస్తోడియన్ అధికారి కె. మోహన్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెన్యూ సూపర్వైజర్లు, అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు ఇన్విజిలేటర్లకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై అవగాహన కల్పించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. నూపూర్ అజయ్, ఆర్డివోలు వైవి ప్రసన్న లక్ష్మి, రవీంద్ర బాబు, లోకల్ ఇన్ఫెక్టింగ్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్స్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News