-31వ డివిజన్ 214 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 31 వ డివిజన్ – 214 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఆయన పర్యటించారు. సచివాలయ పరిధిలోని 1,219 గృహాలలో, 493 ఇళ్లను సందర్శించారు. గొట్టిముక్కల వారి వీధి, రాజ్యంరాజు వీధి, థాట్ల బ్రహ్మరాజు వీధి, సుబ్బరాజు వీధి, బెజ్జం వారి వీధి, పెనుమత్స వారి వీధి, పాల వారి వీధి, హరిజనవాడ కాలనీ, జీఎస్ రాజు రోడ్డు, అల్లూరి సీతారామరాజు రోడ్డు, వానపాల వారి వీధులలో పర్యటించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రతి ఇంటా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. బూస్టర్ డోస్ వేయించుకున్నారా..? లేదా..? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడంపై పలువురికి అవగాహన కల్పించారు. అనంతరం పాదయాత్ర ద్వారా పరిష్కృతమైన పలు సమస్యలకు సంబంధించి లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.
జగనన్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. నున్న, కొండపావులూరు, సూరంపల్లిలో ఇప్పటికే కొందరు ప్రభుత్వ సహకారంతో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్నారని వివరించారు. అలాగే పేదరిక నిర్మూలనలో భాగంగా నియోజకవర్గంలోని 96 వార్డు సచివాలయాలలో సగటున ఒక్కో సచివాలయ పరిధిలో రూ. 3 కోట్ల సంక్షేమాన్ని మూడేళ్లలో అందించినట్లు వివరించారు. 214 సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 3.87 కోట్ల సంక్షేమాన్ని డీబీటీ విధానంలో అందించడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలోనూ ఎక్కడా పేదల సంక్షేమాన్ని విస్మరించలేదన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకుంటే.. కరోనా సమయంలో అత్యంత మరణాలు సంభవించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా తిరుపతిలో నేడు పలు పరిశ్రమ యూనిట్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నట్లు వివరించారు. దీని ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కానీ పేదలకు మంచి జరగడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే తెలుగుదేశం నాయకులు ఏడుపులు మొదలుపెట్టారని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికీ ఆ ఏడుపే ఏడుపు కార్యక్రమం కొనసాగుతోందని విమర్శించారు. ముఖ్యంగా అమ్మఒడి పథకంపై ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని.. ఎవరెంత గగ్గోలు పెట్టినా సీఎం జగన్ పై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. పేదరికంలో ఉన్న తల్లులు తమ పిల్లలను బడికి పంపించాలనే గొప్ప ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా రెండుసార్లు తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే, 2020–21లో ఆ సంఖ్య 44,48,865 కు పెరిగిందన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పథకంలో అర్హత పొందిన వారిలో 81 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు ఉన్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో అమ్మఒడి పథకం ద్వారా 28,834 మంది తల్లుల ఖాతాలలో రెండేళ్లలో రూ. 85 కోట్ల 45 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా 26 ప్రభుత్వ పాఠశాలల్లో 163 అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 19.56 కోట్ల నిధులతో పాటు.. ఆయా పాఠశాలల మరమ్మతులకు రూ. 12.17 కోట్లు మొత్తం రూ. 31.73 కోట్ల నిధులను వెచ్చించినట్లు వివరించారు. కానీ పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనే దురుద్దేశంతో పచ్చ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని మల్లాది విష్ణు మండిపడ్డారు. అమ్మఒడిలో రూ. 2 వేలు పాఠశాలల అభివృద్ధి కోసం తల్లులు స్వచ్ఛందంగా ఇస్తుంటే.. తెలుగుదేశం నాయకులకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందడం టీడీపీ నేతలకు, పచ్చమీడియాకు ఇష్టం లేదా..? అని నిప్పులు చెరిగారు. ఈ నెల 27న అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని.. ఈ సమయంలో పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు భోగాది మురళి, సామంతపూడి గోవిందరాజు(చిన్నా), పట్టాభి రామరాజు, మానం వెంకటేశ్వరరావు, బెజ్జం రవి, వెంకటరెడ్డి, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News