విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు -నేడు పథకం ద్వారా జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి రాజశేఖర్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు- నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బి రాజశేఖర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ.78.79 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేశామని అన్నారు. రెండవ దశలో భాగంగా 156 కోట్ల రూపాయలతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నామని దీనిలో భాగంగా 736 అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 316 పాఠశాలలో అభివృద్ధి పనులకు 20 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ మంజూరయిందని వీటిలో 1.52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. పనులు చేపట్టేందుకు అవసరమైన ఇటుక, ఇసుక, సిమ్మెంట్, ఐరన్ వంటి వాటిని సిద్దం చేసేలా చర్యలు తీసుకున్నామని ఇప్పటికే పాఠశాలల డిపోల వద్దకు మెటీిరియల్‌ను సరఫరా చేసి సిద్దంగా ఉంచామన్నారు. వారం రోజుల్లో పనుల పురోగతి సాధిస్తామని కలెక్టర్ డిల్లీరావు ప్రిన్సిపల్ సెక్రటరి బి రాజశేఖర్‌కు వివరించారు.
Prajavartha Online Telugu News