మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేమెంట్ రాలేదని..సిమెంట్ చేరలేదని సాకులు వెతకరాదని కృష్ణాజిల్లాలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన, వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ భవన నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, గ్రామీణ నీటి వనరులు, సంక్షేమ వసతి గృహాలు తదితర అభివృద్ధి పనుల పురోగతిపై ఎం పి డి ఓ లు సంబంధిత శాఖల ఇంజనీరింగ్, క్షేత్ర స్థాయి అధికారులతో నేరుగా మండలవారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేమెంట్ ..సిమెంట్ సమస్యలు లేవని తెలియచేస్తూ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులు గ్రామ సచివాలయ భవనాల అన్నింటిని ఆగస్టు చివరిలోగా, రైతు భరోసా కేంద్రాలన్నీ సెప్టెంబర్ చివరి లోగా.., డాక్టర్ వైయస్సార్ హెల్త్ క్లినిక్ లను అక్టోబర్ చివరి నాటికి.. ఎలాంటి పెండింగులు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఇంతవరకు మొదలు కానీ భవనాలను యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల లోగా ప్రారంభించి.. 15 రోజులలోగా బేస్మెంట్ స్టేజ్ కు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ప్రతి వారం స్టేజ్ కన్వర్షన్ పనులను 20% కు తగ్గకుండా చేయాలని ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఏ ఇ లు అప్రమత్తంగా ఉండాలని వివిధ భవనాల పురోగతి విషయమై తానె స్వయంగా పర్యవేక్షిస్తానని , ప్రగతి సరిగా లేనివారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు వెనకాడే ప్రసక్తి లేదని కలెక్టర్ హెచ్చరించారు. నాగాయలంక మండలంలో మే నెలలో బిల్లులు చెల్లించినప్పటికీ , మూడు నెలలు గడిచినప్పటికీ 3 భవనాలు నిర్మాణం అక్కడ నత్త నడకన ఎందుకు సాగుతున్నాయని, పంచాయతీరాజ్ తరఫున మీరు ఉండి ప్రయోజనం ఏమిటని సంబంధిత ఏ ఇ ను కలెక్టర్ ప్రశ్నించారు. అలాగే మోపిదేవి మండలంలోని చిరువోలులంక , మెరకనపల్లి, మోపిదేవి- 2 , వెంకటాపురంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎందుకు జరగడం లేదని నిలదీశారు.
ఈ సమీక్ష సమావేశంలో డి ఆర్ ఓ ఎం. వెంకటేశ్వర్లు, ఎస్ ఇ ఈరాస్వామీ, డ్వామా పి డి జి. సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News