విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లేఅవుట్లలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలోని లబ్దిదారులకు కేటాయించిన లేఅవుట్లలో జరుగుతన్న పనులను బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్లో హౌసింగ్, లేఅవుట్ స్పెషల్ ఆఫీసర్లు, తహాశీల్థార్లు, ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న గృహ నిర్మాణాలకు లేఅవుట్లలో ఎదురవుతున్న ఇబ్బందులను సంబంధిత శాఖాధికారులు సమన్వయంతో పరిష్కరించుకుని వేగవంతం చేయాలన్నారు. ముఖ్యంగా లేఅవుట్ల చదును, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటిబోర్వెల్స్, డ్రైనేజ్, వంటి తదితర వసతులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గాలవారిగా సంబంధిత గృహా నిర్మాణ, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఎజెన్సీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమీక్షించారు. నిధుల కొరత లేదని ఎప్పటికప్పడు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. లేఅవుట్లలో లబ్దిదారులకు అవసరమైన ఇసుక, సిమ్మెంట్, ఐరన్ వంటి మెటీరియల్ అందుబాటులో ఉంచామన్నారు. అయిన్నప్పటికి లేఅవుట్లలో నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడానికి తగిన కారణాలను తెలుసుకుని అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు విజయవాడ రూరల్ నున్న, గన్నవరం మండలం సూరంపల్లి కొండపావులూరు లేఅవుట్లలో 14,986 గృహా నిర్మాణాలను, విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో కంకిపాడు మండలం ఉప్పులూరు, పెనమలూరు మండలం వణుకూరు`1,2,3 లేఅవుట్లు, గన్నవరం మండలం వెదురుపావులూరులలో 16,307 గృహా నిర్మాణాలను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని లబ్దిదారులకు కొండపల్లి మున్సిపల్, గన్నవరం మండలం వెదురుపావులూరు పశ్చిమ లేఅవుట్లలో 11వేల గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. వివిధ దశలలో ఉన్న నిర్మాణాలకు అసరమైన సదుపాయాలను అధికారులు కల్పించి, లబ్దిదారులు గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్, డిఆర్వో కె.మోహన్‌కుమార్, నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్, అదనపు కమీషనర్ సత్యవతి, హౌసింగ్ పిడి శ్రీదేవి, డిఇ రవికాంత్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ ఎన్వివి సత్యనారాయణ, డ్వామా పిడి జె. సునీత, తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని తహాశీల్థార్లు ఉన్నారు.
Prajavartha Online Telugu News