విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ రంగంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల ఆడిటోరియంలో బుధవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యుత్ రంగంలో దేశం సాధించిన విజయాలను ప్రగతిని మననం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు ప్రగతిపై చర్చించేందుకు ఉజ్జ్వల భారత్ ఉజ్జ్వల భవిష్యత్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డిల్లీరావు జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడి విద్యుత్ రంగంలో భారత దేశం మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు. గతంలో విద్యుత్ కోతలు ఉండేవని, ప్రస్తుతం డిమాండ్‌ను మించి మిగులు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాలకు పోను మిగులు విద్యుత్తును ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు. విద్యుత్ రంగంలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పటానికి ఇది చక్కని నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ఫ్రభుత్వాలు ఇంధన భద్రత కోసం చేపడుతున్న వివిధ సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. వన్‌నేషన్ వన్ గ్రిడ్ విద్యుత్ వినియోగదారుల హక్కులు మరియు గృహ విద్యుదీకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మనదేశ విద్యుత్ గ్రిడ్ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత గ్రిడ్ వ్యవస్థగా మారిందన్నారు. ఇది మనందరికీ ఎంతో గర్వకారణం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ వినియోగం పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడగలిగిన వారమవుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టి వినియోగ దారులకు చేరువగా విద్యుత్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఈడి బల్బ్‌ల వాడకం ద్వారా తక్కువ విద్యుత్ వినియోగం జరిగి విద్యుత్ ఆదా అవుతుందని,దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని వినియోగాన్ని పెంచామన్నారు. ఉజ్జ్వల్ భారత్ ఉజ్జ్వల్ భవిష్య ` పవర్ 2047 లో భాగంగా దేశవ్యాప్తంగా బిజిలీ మహోత్సవాలు జరుగుతున్నాయని తద్వారా విద్యుత్ రంగాలలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికి విద్యుత్ వెలుగులు అందించేలా కృషి చేస్తున్నాయని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో ఏపిసిపిడిసిఎల్ సియండి జె. పద్మజనార్థాన్రెడ్డి, ఎస్ఇ యం శివప్రసాద్‌రెడ్డి, విజయవాడ రూరల్ ఇఇ జి.బి శ్రీనివాసరావు, మైలవరం డిఇఇ ఐ సుధాకర్, ఏఇఇ జి.రమేష్‌బాబు, ఆర్ఇసి లిమిటెడ్ మేనేజర్ యం శోభన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News