మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగంలో ప్రజలకు 24 X 7 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు అనేక నూతన సంస్కరణలు చేపట్టిందని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల పేర్కొన్నారు.
గ్రామీణ విద్యుదీకరణ సంస్థ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ సంయుక్తంగా శుక్రవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ మందిరంలో నిర్వహించిన ‘ఉజ్వల భారత్- ఉజ్వల భవిష్యత్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండేదని , విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ‘ బిజ్లీ మహోత్సవ్ ‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. అజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా ఏపీలోని 26 జిల్లాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని జె సి అన్నారు. అనంతరం ఆపరేషన్స్ సర్కిల్ సూపెరిండెంటింగ్ ఇంజినీర్ ఎం. శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ 75 ఏళ్లలో మారుమూల ప్రాంతాలకు సైతం విద్యుత్ అందుతోందని దేశంలో చీకట్లను తొలగించి ప్రగతి సాధించడంలో విద్యుత్ కీలకపాత్ర పోషించిందన్నారు. ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వశాఖ, భవిష్యత్తులో చేపట్టే దేశవ్యాప్తంగా దీంతోపాటు వన్ నేషన్ వన్ గ్రిడ్, వినియోగదారుల హక్కులు, విద్యుత్ రంగంలో అవసరమైన మార్పులను స్వాగతిస్తారని, 2047 నాటికి సాధించాల్సిన విజయాలపై లక్ష్యాలను నిర్దేశిస్తారని చెప్పారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి -మిగులు విద్యుత్ అంశంలో చొరవ చూపుతూ.. ప్రణాళిక బద్ధంగా విద్యుత్ వినియోగం అంశంలో అడుగులు వేస్తున్నాయన్నారు. విద్యుత్ ను పొదుపుగా ఎలా వినియోగించాలో తెలియచేస్తూ కళాజాతా కార్యక్రమం, బాలికలు చేసిన కూచిపూడి నాట్యం పలువురిని ఆకర్షించింది. ఒకే దేశం, ఒకే గ్రిడ్ పునరుత్పాదక ఇంధన వనరులు గ్రామీణ విద్యుదీకరణ వ్యవస్థ తదితర అంశాలపై లఘు చిత్రాలు ప్రదర్శన ఆకట్టుకొంది. ఈ కార్యక్రమంలో ఏపి సి పి డి సి ఎల్ విజయవాడ జనరల్ మేనేజర్ ఎం. సాంబశివరావు, మచిలీపట్నం ఆపరేషన్స్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్ ఎం. భాస్కరరావు, ఆర్ ఈ సి అధికారులు, ఏపి సి పి డి సి ఎల్ డిప్యూటీ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్లు , ఏ ఈ లు , జె ఈ లు , ఏపి సి పి డి సి ఎల్ విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News