-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామలింగేశ్వర పేటలోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 210 గడపలను సందర్శించారు. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. పథకాల అమలులో తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. గత మూడేళ్ల కాలంలో సచివాలయ పరిధిలో రూ.2.68 కోట్ల సంక్షేమాన్ని అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా కాలనీలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సైడ్ కాల్వలలో మురుగు పారే విధంగా ఎప్పటికప్పుడు సిల్ట్ తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట కొత్త కాలువ లైన్లు వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంలో భాగంగా తరచూ నీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సెంట్రల్ ప్రాంతం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా, ఏ పేద కుటుంబం తలుపుతట్టినా..సంక్షేమ పథకాలు అందుతున్నాయనే చెబుతున్నారన్నారు. పర్యటనలో భాగంగా స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించడంతో పాటు.. ఆరోగ్య సూత్రాలను తెలియపరచాలని సిబ్బందికిసూచించారు.
అగ్రవర్ణ పేదలకూ మంచి చేసే దిశగా అడుగులు
ఈబీసీ నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన పలువురు అక్కచెల్లెమ్మలతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు ముచ్చటించారు. అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని గుర్తించిన తొలి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. నియోజకవర్గంలో 1,947 మందికి గత ఆర్థిక సంవత్సరం రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నారా లోకేష్ కు లేదు
ఎదుటివారిపై బురదజల్లి ఆనందించడంలో చంద్రబాబు, నారా లోకేష్ ను మించిన వారు లేరని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన నారా లోకేష్ కు.. ఒంటి చేత్తో 151 స్థానాలను గెలిపించుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని వ్యాఖ్యానించారు. గత తెలుగుదేశం హయాంలో రాష్ట్ర యువతకు చంద్రబాబు, నారా లోకేష్ చేసిన మేలు ఏమీ లేదని పేర్కొన్నారు. పాట్నర్ షిప్ సమ్మిట్ల పేరుతో వందల కోట్ల ప్రజాధనం లూటీ చేసి ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ వంటి భారీ పరిశ్రమలు ఏపీ వైపు చూస్తున్నాయని మల్లాది విష్ణు వెల్లడించారు. మూడేళ్ల కాలంలో 98 భారీ పరిశ్రమల ద్వారా 39,350 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో 31,671 పరిశ్రమలు, రూ.8,285 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే.. ఓర్వలేక చంద్రబాబు అండ్ కో విషం కక్కుతోందని మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా నారా లోకేష్ మాటలను ప్రజలు నమ్మడం మానేసి చాలా కాలం అయిందని.. క్విట్ మంగళగిరి అని ప్రజలు తిరస్కరించినా ఆయన తీరు మారకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నాలను దుష్ట చతుష్టయం మానుకోవాలని హితవు పలికారు. మరోవైపు తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లు, టీడీఆర్ బాండ్ల పేరిట తాము కొల్లగొట్టిన డబ్బును కూడా.. అభివృద్ధి పేరిట తెలుగుదేశం నాయకులు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మల్లాది విష్ణు పేర్కొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఆర్.ఐ.(రెవెన్యూ) ప్రసాద్, ఏఈ(ఇంజనీరింగ్) వెంకటేష్, వైసీపీ డివిజన్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, నాయకులు శ్యామ్, వీరంకి నాగు, ఇసరపు రాజా రమేష్, భోగాది మురళి, పేరం త్రివేణి రెడ్డి, శ్రీను, రంగా, లక్ష్మణ, ఆనంద్, లత, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News