
-అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సంపత్తితో మెరుగైన వైద్య సేవలు
-ఆధునిక చికిత్సలు, అత్యాధునిక వ్యాధి నిర్ధారణ వ్యవస్థతో, అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్
-మహిళలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యమని హాస్పిటల్ ఛైర్ పర్సన్ డాక్టర్ అక్కినేని మణి
-ఈనెల 21న కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిచే అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, స్త్రీల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దబడిన అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక సంపత్తితో మహిళలందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ స్థాపించబడినట్లు సంస్థ ఛైర్ పర్సన్ డాక్టర్ అక్కినేని మణి వెల్లడించారు. గడచిన ఐదు దశాబ్దాలుగా దేశ, విదేశాల్లో మహిళలకు విశిష్ట వైద్య సేవలందించిన డాక్టర్ మణి.. స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకేచోట సమగ్రమైన చికిత్సలను అందించేందుకు ‘అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్’కు రూపకల్పన చేశారు. వివిధ విభాగాలకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులను ఒక్కచోటికి చేర్చి, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థ, నవీన సాంకేతిక సదుపాయాలతో ఈ హాస్పిటల్ ను తీర్చిదిద్దినట్లు డాక్టర్ మణి వివరించారు. భారతీనగర్ సర్వీస్ రోడ్డులోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కుటుంబాన్ని సంరక్షించే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లయితే, కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గైనకాలజీ చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, సంతాన సాఫల్య చికిత్సలు, డెర్మటాలజీ, రేడియాలజీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నవజాత శిశు ఆరోగ్య సంరక్షణ, ఆర్థోపెడిక్, అత్యవసర వైద్య సేవలు, కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీ, డెంటల్, డైటీషియన్ తదితర సేవలతో పాటు, ఆయుర్వేద వైద్య సేవలు సైతం తమ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పేషేంట్లకు త్వరితగతిన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సలను అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని వివరించారు. పేషేంట్లు పలుమార్లు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సంబంధిత రికార్డులను వెంటతెచ్చుకోవడం వంటి ఇబ్బందులను తొలగిస్తూ, వివిధ వైద్య విభాగాలను అనుసంధానం చేస్తూ, సమగ్రమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. టెలీ మెడిసిన్ సేవలతో పాటు, విర్చ్యువల్ కన్సల్టేషన్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. తన భర్త, ప్రఖ్యాత వైద్య నిపుణులు దివంగత డాక్టర్ అక్కినేని సుదర్శనరావు స్పూర్తితో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను నెలకొల్పినట్లు డాక్టర్ మణి తెలియజేశారు. ఈనెల 21న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ ను ప్రారంభిస్తారని ఆమె ప్రకటించారు. ఈ సమావేశంలో డాక్టర్ పిడికిటి మధుబిందు, డాక్టర్ తెన్నేటి అపర్ణ, డాక్టర్ దావులూరి సౌమ్య, డాక్టర్ రామినేని స్ఫూర్తి, డాక్టర్ చలసాని ప్రవీణ, డాక్టర్ గుమ్మడి స్వప్న పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News