-32వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసేవ, అభివృద్ధే ధ్యేయంగా ప్రగతిశీల అభ్యుదయ భావాలతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సోమవారం 32 వ డివిజన్ 232 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. రామలింగేశ్వర పేట జీరో లైన్, ప్రధాన రహదారితో పాటు లోటస్ సెక్టార్ 4 లోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 210 గడపలను సందర్శించారు. స్థానికుల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శానిటేషన్ సిబ్బంది రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా రెండు పూట్ల ఫాగింగ్, మందు పిచికారీ చేయాలన్నారు. ప్రతి ఇంటి వద్ద పుస్తకం ఏర్పాటు చేసి.. అందులో శానిటేషన్, మలేరియా సిబ్బంది రోజూ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు.
అయోధ్యనగర్ సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అయోధ్యనగర్ పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఒక్క లోటస్ ప్రాంతంలోనే రూ. 2.12 కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చినట్లు వెల్లడించారు. సెక్టార్-1 పార్కులో రూ. 13 లక్షల వ్యయంతో గతేడాది ఓపెన్ జిమ్ తో పాటు పోర్టబుల్ మొబైల్ ఆఫీస్ ను కూడా ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తుచేశారు. అలాగే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంలో భాగంగా రూ. 80 లక్షల వ్యయంతో అయోధ్యనగర్ ప్రధానరహదారి వెంబడి సకల సదుపాయాలతో అర్బన్ హెల్త్ సెంటర్ ను నిర్మించడం జరిగిందన్నారు. వీలైనంత త్వరలో హెల్త్ సెంటర్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. అలాగే బసవతారకనగర్ లో రోడ్ల నిర్మాణానికి రూ. 13 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేయగా.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇదేవిధంగా కొనసాగుతుందని.. ఒక్కో సచివాలయానికి కేటాయించిన రూ. 20 లక్షల నిధులు ఇందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్ష నేతల పిచ్చి పరాకాష్టకు చేరింది
రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలకు పైత్యం తలకు ఎక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా చంద్రబాబు, నారాలోకేష్, సోమువీర్రాజు, పవన్ కళ్యాణ్ ల పరిస్థితి ప్రమాదకరంగా మారిందన్నారు. 2014-19 మధ్య కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నివిధాలా భ్రష్టుపట్టించారని ఈ దుష్టచతుష్టయం.. మరలా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలతో సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఓవైపు కులరహిత సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్శిశలు కృషి చేస్తుంటే.. మరోవైపు కులాల పేరిట ప్రతిపక్ష నేతలు ప్రజల్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లటానికి టీడీపీ నేతలు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని నిప్పులు చెరిగారు. సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 400 కోట్ల అభివృద్ధి చేశామని చెప్పుకునే పచ్చ నేతలు.. ప్రజలకు ముఖం చూపడానికి మాత్రం ఎందుకు భయపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఎవరి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందో విజ్ఞులైన ప్రజలకు తెలుసని.. తాము అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధిని నగర ప్రజలు నిత్యం చూస్తున్నారన్నారు. మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఏ ఒక్క హామీని అమలు చేయని కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గూర్చి నిర్లజ్జగా మాట్లాడుతున్నారని మల్లాది విష్ణు విమర్శించారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సహా విభజన హామీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(వాటర్ & యూజిడి) రామకృష్ణ, ఆర్.ఐ.(రెవెన్యూ) ప్రసాద్, వైసీపీ డివిజన్ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరెడ్డి, నాయకులు దుర్గాప్రసాద్, నాడార్స్ శ్రీను, ఆత్మకూరు సుబ్బారావు, శ్యామ్, భోగాది మురళి, ఈశ్వర్, కిషోర్, వాసు, రామకృష్ణ, మురళీ, చంద్రమోహన్, పేరం త్రివేణి రెడ్డి, సువర్ణరాజు, మాల్యాద్రి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News