-మెగాస్టార్ జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ ఆదినారాయణతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు సినీ ప్రపంచంలో శిఖరాగ్ర స్థానానికి చిరంజీవి గారు చేరుకున్నారని కొనియాడారు. తన అద్భుత నటన, డ్యాన్స్ లతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. కొన్ని దశాబ్దాలు సినీ పరిశ్రమని మకుటం లేని మహారాజుగా ఏలడంతోపాటు.. తన రికార్డులతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచారన్నాను. కేవలం చిత్ర రంగంలోనే కాకుండా సామాజిక సేవ చేయడంలోనూ మంచి మనసున్న వ్యక్తిగా చిరంజీవి పేరు సంపాదించారన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని.. తన సంపాదనలో అధిక భాగం సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేసే రియల్ లైఫ్ హీరో అని కీర్తించారు. ఆయన స్థాపించిన ఐబ్యాంకు, బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారన్నారు. కరోనా కష్ట సమయంలోనూ తెలుగు రాష్ట్రాల్లో తన వ్యక్తిగత ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా సినీకార్మికుల కోసం తన తండ్రి పేరుమీద హాస్పిటల్ ను నిర్మించేందుకు చిరంజీవి గారు ముందుకు రావడం చాలా గొప్ప విషయమన్నారు. తనలాగే అభిమానులను సైతం రక్తదానం, సేవాకార్యక్రమాల వైపు నడిపించిన గొప్ప మానవతావాది చిరంజీవి అని.. నేటితరానికి ఆయనొక రోల్ మోడల్ అని చెప్పుకొచ్చారు. చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెన్నం రత్నారావు, ఇసరపు రాజా రమేష్, ప్రేమ్ కుమార్, ఖాన్, వి.బి.ఆచారి, చిరంజీవి అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News