విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడి నమ్మిన సిద్దాంతానికి నిలబడిన మహానేత ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు బావి తరాలకు ఆదర్శమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వాతంత్య్ర సమరయోదుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరిని అన్నారు. స్వరాజ్ అనే దిన పత్రికను ప్రారంభించారని 1928లో మద్రాసులో సైమన్ కమీషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకికి ఎదురునిలిచి కాల్చమని సవాలు చేశారన్నారు. ఆయన ధైర్యసహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారని కలెక్టర్ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసి ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. 1946లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు.1942లో క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు టంగుటూరు ప్రకాశం పంతులును అరెస్ట్ చేసి మూడు సంవత్సరాలు జైల్లో ఉంచారన్నారు. 1945లో జైలు నుండి విడుదలైన అనంతరం ప్రజలకు చేరువ కావడానికి దక్షిణ భారతదేశమంతా పర్యటించారని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. మహాత్మాగాంధీ తన నిజమైన వారసునిగా ప్రకాశం పంతులును గుర్తించారన్నారు. కీర్తిశేషులు ప్రకాశం పంతులు చొరవతో కృష్ణా బ్యారేజీ నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఆయన చేసిన సేవలు త్యాగాలు చిరస్థాయిలో నిలిచిపోతాయని ప్రజా హృదయాలలో ఆయన ఎల్లప్పుడు సజీవంగానే నిలుస్తారని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోనియాడారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసిస్టెంట్ బిసి వెల్ఫెర్ ఆఫీసర్ హనుమ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News