-డిప్యూటీ మేయర్ తో కలిసి రూ. 9.32 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 58వ డివిజన్ నందమూరి నగర్లో రూ.4.50 లక్షలతో యూజీడీ మరియు తోటవారి వీధి 12, 15 క్రాస్ రోడ్లలో రూ.4.82 లక్షలతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానికులతో కలిసి బుధవారం ఆయన భూమిపూజ నిర్వహించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పోతూపోతూ నగరంలో పెద్దఎత్తున సమస్యలను వదిలివెళ్లిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు విమర్శించారు. వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీలకు సైతం మురుగునీటి పారుదల వ్యవస్థ, సౌకర్యవంతమైన రహదారులు, పుష్కలమైన తాగునీరు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ వంటి వసతులను కల్పిస్తున్నట్లు వివరించారు. గడిచిన మూడేళ్లలో డివిజన్ లో దాదాపు రూ. 15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. దీంతో డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రాంతంలో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. మరోవైపు డివిజన్లో రాష్ట్ర హోం శాఖ మంత్రి చేతులమీదుగా శంకుస్థాపన నిర్వహించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డి మాట్లాడుతూ.. డివిజన్ లో నందమూరి నగర్, తోటవారివీధి ఉన్నట్లు కూడా గత పాలకులకు తెలియదని విమర్శించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో డివిజన్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ(వాటర్ & యూజిడి) రామకృష్ణ, ఏఈ(ఇంజనీరింగ్)లు అరుణ్ కుమార్, మౌసమి, నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, బెవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, అఫ్రోజ్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News