-58వ డివిజన్ 255 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల మేనిఫెస్టోతో సంక్షేమంలో సరికొత్త అధ్యాయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. బుధవారం 58 వ డివిజన్ 255 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, అధికారులు, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. వడ్డెర కాలనీలోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 376 గడపలను సందర్శించారు. ప్రతిఒక్కరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలును బుక్ లెట్ల ద్వారా అంకెలతో సహా వివరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. కొత్తగా వచ్చిన వారికి మ్యాపింగ్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని వాలంటీర్లకు సూచించారు. ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడంలో భాగంగా తరచూ నీటి పరీక్షలు నిర్వహించాలని వీఎంసీ సిబ్బందికి తెలిపారు. ప్రజలు మలేరియా, డెంగ్యూ వ్యాధుల బారిన పడకుండా.. పెరీ డొమెస్టిక్ ప్రోగ్రాం (PDP) యాక్టివిటీపై ఏఎల్వోలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పర్యటనలో భాగంగా 502, 506, 513 అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.
పరిపాలనలో సంపూర్ణ పారదర్శకత, జవాబుదారీతనం
వార్డు సచివాలయాల ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారదర్శకత, అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 255వ వార్డు సచివాలయాన్ని ఆయన సందర్శించారు. రాష్ట్రంలోని దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు ప్రభుత్వం రూ.3,000 కోట్లు కేటాయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే కలెక్టర్లు విధిగా ప్రతి నెలా ఆరు సచివాలయాలను సందర్శించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇకపై వార్డు సచివాలయాలలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల నుంచి గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుందని.. ఆ కార్యక్రమాలలో తాము కూడా పాల్గొంటామని తెలియజేశారు. అధికారులలో జవాబుదారీతనాన్ని పెంచే ఇటువంటి ఆలోచనలు చేయలేకపోయింనందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సిగ్గుపడాలన్నారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలను నాటారు. చెట్లను పెంచి పచ్చదనాన్ని పంచే ఇటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని సూచించారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
రాజకీయంగా ఎదుర్కొనలేక గోబెల్స్ ప్రచారం
రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న నవరత్నాల కార్యక్రమాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్ రెట్టింపు ఆనందాన్ని నింపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రభుత్వం ఇస్తోన్న ఈ వరాలు చూసి తట్టుకోలేక రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రజలను కులాలు, మతాలు, ప్రాంతాలుగా చీల్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్న తీరు హేయమన్నారు. గత చంద్రబాబు హయాంలో నగరంలో పదుల సంఖ్యలో దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన నాయకులు.. హిందుత్వం గూర్చి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అన్ని మతాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, మతసామరస్యం పరిఢవిల్లుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. దేవాలయాల ప్రతిష్టను, హిందు ధర్మాన్ని పరిరక్షిస్తూ.. తెలుగుదేశం హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మిస్తున్నారని వెల్లడించారు. పీఠాధిపతులు, మఠాధిపతుల విలువైన సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నట్లు వివరించారు. వినాయక చవితి వేడుకలపైన ప్రభుత్వం ఎటువంటి కఠిన ఆంక్షలు విధించలేదని.. తెలుగుదేశం నేతలు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(వాటర్ & యూజిడి) రామకృష్ణ, ఏఎంహెచ్ఓ రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, హఫీజుల్లా, అఫ్రోజ్, బెవర నారాయణ, ఉమ్మడి వెంకట్రావు, ఇసరపు రాజారమేష్, నేరెళ్ల శివ, పొదిలి శైలజా, శర్మ, తోపుల వరలక్ష్మి, జలీల్, వలి, భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News