-58వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శనివారం 58 వ డివిజన్ 252 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎక్సెల్ ఫ్యాక్టరీ వద్ద మొక్కలను నాటి పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్సార్ కాలనీ, భగత్ సింగ్ పార్కు రోడ్డు వరకు విస్తృతంగా పర్యటించారు. 220 గడపలను సందర్శించి ప్రజల నుంచి గ్రీవెన్స్ స్వీకరించారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతన పాలనను అందించడంలో భాగంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నట్లు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఎమ్మెల్యేకు వివరించారు. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు చవి చూసామని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. జగనన్న అందిస్తున్న సాయాన్ని పెట్టుబడిగా చేసుకుని మహిళలందరూ లాభాలు గడించేలా వ్యాపారవేత్తలుగా మారాలని మల్లాది విష్ణు ఆకాంక్షించారు.
చిన్నారులకు టీకాలే శ్రీరామరక్ష
పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం టీకాలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా స్థానిక వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. సమయానికి రోగ నిరోధక టీకాలు వేయించడం ద్వారా పిల్లలందరూ ఆరోగ్యంగా ఎదుగుతారని మల్లాది విష్ణు అన్నారు. ఈ వ్యాక్సిన్ల వల్ల ప్రాణాంతకమైన 20 రకాల వ్యాధుల బారిన పడకుండా చిన్నారులను కాపాడుకోవచ్చని తెలిపారు. వ్యాధి నిరోధక టీకాల వల్ల వారిలో క్రాస్ ఇమ్యూనిటీ కచ్చితంగా ఉంటుందన్నారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న సేవలు, అందుబాటులో ఉన్న మందులు, తదితర వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రికి అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా..? అని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆశా వర్కర్ల నుంచి హెల్త్ సెక్రటరీల వరకు ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మాస్టర్ కె.రవి అనంత్(11) కు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు
క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే యువతను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ కు చెందిన కె. రవి అనంత్(11) తెలుగు రాష్ట్రాల ఐ.సి.ఎస్.ఈ, ఐ.ఎస్.సి పాఠశాలల క్రీడల్లో అండర్ – 14 విభాగంలో పసిడి పతకం సాధించడంతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా వైఎస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తమ పిల్లలను క్రీడల పట్ల ప్రోత్సహించిన తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. రవి అనంత్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని, అంతర్జాతీయంగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి బకాయిల బాబుకు లేదు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలన్నీ అబద్ధపు ప్రచారాలను నమ్ముకున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కుప్పం వేదికగా సీఎం వైఎస్ జగన్ పై చంద్రబాబు చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని విమర్శించే ముందు.. పిల్లనిచ్చిన మామ నీ గూర్చి ఏం మాట్లాడారో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ప్రతిపక్ష నేతకు సూచించారు. చంద్రబాబు ఒక వెన్నుపోటుదారుడని, అతడో ఆషాఢభూతి అని, ఔరంగజేబు అని సాక్షాత్తూ ఎన్టీఆర్ గారు తన గుండెకోతను వివరించలేదా..? అని ప్రశ్నించారు. కనుక ప్రజాక్షేత్రంలో మాట్లాడే ముందు హుందాతనంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు తన హయాంలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిల భారం రూ. 2 లక్షల కోట్లపైనే అని తెలియజేశారు. కాంట్రాక్టర్లకు రూ. వేల కోట్ల బిల్లులు, విద్యుత్ శాఖలో రూ. 22 వేల కోట్ల బకాయిలు, రైతులకు రూ. 990 కోట్ల ధాన్యం బకాయిలు.. ఇలా ప్రతి శాఖను అప్పుల ఊబిలోకి నెట్టి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. చివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ లోనూ బకాయిలు పెట్టి పేద విద్యార్థులను చదువులకు దూరం చేసిన చంద్రబాబు.. మరలా ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంపదను సృష్టిస్తూ.. సంక్షేమ పథకాల రూపంలో పేదల అవసరాలను తీరుస్తున్నారన్నారు. అలాగే గత ప్రభుత్వం వదిలివెళ్లిన బకాయిలను కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాల ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తేనే.. వైఎస్సార్ సీపీకి 151 సీట్లు వచ్చాయనే విషయం సోము వీర్రాజు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చవితి వేడుకలపై చేస్తున్న అసత్య ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈలు గురునాథం, రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, నేరెళ్ల శివ, తోపుల వరలక్ష్మి, బొందిలి శైలజా, భోగాది మురళి, ఉమ్మడి వెంకట్రావు, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News