విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి ప్రజాసేవకు పాటుపడే పార్టీ కాదని అధికార హస్తగతమే దాని పరమార్థమని సిపిఐ(యం.యల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గాంధీ నగర్ లోని ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఉద్ఘాటించారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలలో ఆ పార్టీ ఎమ్మెల్యేలలో చీలిక తీసుకువచ్చి కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆ రాష్ట్రాలను హస్తగతం చేసుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రాలను ,తన చెక్కుచేతులలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నదని అయన అన్నారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బిజెపికి చుక్కలు చూపించారని, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చినట్లయితే బిజెపిని తుదముట్టించవచ్చని దీపాంకర్ అన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ లో దీపాంకర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గోద్రా ఘటన అనంతరం సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో న్యాయ పోరాట ఫలితంగా శిక్షలు పడిన నిందితులను మోడీ ప్రభుత్వం ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని దీపాంకర్ తీవ్రంగా విమర్శించారు. మోడీ దేశాన్ని ఆదాని అంబానీలకు దోచిపెడుతున్నారు. దేశంలోని బ్యాంకుల నుండి అప్పులు ఇప్పించి విదేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించి ,ఆర్థికంగా వారు లబ్ధి పొందడానికి దోహదపడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తు, దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత్ మరో శ్రీలంక అవుతుందన్నారు.
దేశంలోని భారత రైల్వేస్ తో సహా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను మోడీ ప్రైవేటుపరం చేస్తూ దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దేశంలోని క్రిస్టియన్ మైనారిటీ వర్గాలు, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించాలని బిజెపి కుట్రపన్నుతూ, భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని దెబ్బతీసే చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని దీపాంకర్ పేర్కొన్నారు. భారత సైనిక రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ,సైన్యంలో అగ్నిపద్ కాంట్రాక్ట్ సర్వీస్ అనేది ఒక భారీ కుంభకోణమని ఆయన అన్నారు. దేశంలో ఏక పార్టీ వ్యవస్థను సృష్టించి శాశ్వతంగా తాము అధికారంలో ఉండే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు, యువత దాన్ని తిప్పి కొట్టాలని దీపాంకర్ విజ్ఞప్తి చేశారు.
ఐజేయుఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు దీపాంకర్ ను శాలువతో సత్కరించగా, సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబు మెమొంటో అందజేశారు , తొలుత ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ స్వాగతం పలుపగా, ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు కే.జయరాజ్ పుష్పగుచ్చాన్ని అందజేశారు.
Prajavartha Online Telugu News