-విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ
-ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విద్యావ్యవస్థ, విద్యార్థులు బాగుపడాలంటే ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులందరూ తమవంతు సహకరించాలని విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ కోరారు. సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖామాత్యులు మాట్లాడుతూ విద్యాభివృద్ధి లక్ష్యంగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్కరణలు చేపడుతోందని, వాటిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రస్తుతం రాష్ట్రంలోని 672 ఎంఈవో పోస్టులకు 424 మంది పని చేస్తున్నారని, వారిలో 413 మంది జిల్లా పరిషత్ పాఠశాలల నుంచి, 11 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నారని తెలిపారు. మిగతా 248 ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులకు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులకు FAC బాధ్యతలు ఇచ్చామని తెలిపారు. మరో 672 ఎంఈవో పోస్టులను కొత్తగా సృష్టించి జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులకు FAC బాధ్యతలు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని మేనేజ్ మెంట్లను ఒకే విధంగా పరిగణిస్తుందని, టీచర్లందరూ సమానమేనని అన్నారు. సమస్యలు ఏవైనా ఎదురైతే పరిష్కార దిశగా ఆలోచనలు ఇవ్వాలని, ప్రభుత్వ విధి విధానాలపై అపార్థం చేసుకోవద్దని తెలిపారు.
ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి
విద్యాశాఖలో పని చేసే అన్ని స్థాయిల సిబ్బందికి ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందరూ హాజరు వేయడం తమ బాధ్యతగా భావించాలని, సకాలంలో యాప్ గుర్తించకపోతే సాంకేతిక సమస్యగా గుర్తించి ఉపాధ్యాయులపై చర్యలు ఉండవని తెలిపారు. యాప్ లో సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకువస్తే, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉపాధ్యాయుల పట్ల సానుకూల దృక్ఫథంతో ఉంటుందే తప్ప కక్ష సాధింపు చర్యలు లాంటివి ఉండవని తెలియజేశారు. ఉపాధ్యాయులందరూ అనుకుంటున్నట్లుగా ఈ యాప్ వల్ల వారి వ్యక్తిగత సమాచార గోప్యతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్, సమగ్ర శిక్షా అడిషనల్ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వా రామలింగం, గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News