Breaking News

తెలంగాణ దూకుడుకు అడ్డుకట్ట వేసి పోలవరం వల్ల ఆదా అయ్యే 45 టీ ఎం సి ల నీరు రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
చట్టబద్దమైన రాయలసీమ సాగునీటి హక్కుల పరిరక్షణకు అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన కృష్ణా నది యాజమాన్య బోర్డు రద్దు చేయాలని తెలంగాణ వాదులు తెలంగాణ హైకోర్టులో వేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు కొనసాగింపుకు ఇంప్లీడ్ ఫెటిషన్ వేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామి రెడ్డి అన్నారు. విజయవాడ స్థానిక ఓ హోటల్లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో బొజ్జ దశరథ రామి రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి భవిష్యత్తుకు విఘాతం కలిగించే కీలకమైన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో జరిగిన విషయాలను ఆయన వివరించారు. జలాలున్న ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన తెలుగు గంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు పొందడానికి ఏర్పాటు చేసిన కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణ వాదులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని ప్రతిపక్ష పార్టీలు , రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు వ్యతిరేకించాలని దశరథరామిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు కొనసాగింపుకు తెలంగాణా హైకోర్ట్ లో ఇంప్లీడ్ ఫిటిషన్ వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని పొందుపరచిన రాయలసీమ ప్రాజెక్టులు తెలుగు గంగ, హాంద్రీనివా, గాలేరు – నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు కేంద్రంతో పోరాడి అనుమతి సాధించుకున్నామని ఆయన వివరించారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ద్వారా పోలవరం / పట్టిసీమ నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 45 టీఎంసీల నీరు పై ప్రాజెక్టులకు నికర జలాలుగా పొందే హక్కు ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు బదలాయించడంలో అలసత్వం వహించడం వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆ 45 టి ఎం సి ల నీరు తమ వాటాగా చూపించి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో ద్వారా కేటాయించుకొని ఏకంగా కేంద్ర జల వనరులు సంఘాన్ని అనుమతి కోరిందని ఆయన గుర్తు చేశారు. ఇది రాయలసీమ ప్రాజెక్టుల పట్ల మన ప్రభుత్వ చిన్న చూపు , నిర్లక్ష్యం గా భావిస్తున్నామన్నారు. ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు , తెలుగు జాతి సమిష్టి గా పోలవరం , విశాఖ ఉక్కు కోసం పోరాడాలనే ప్రజా సంఘాలు, ప్రభుత్వ సలహాదారులు, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు, సమైక్యాంధ్ర మేదావులు , విశ్రాంత సాగునీటి సాంకేతిక నిపుణులు ఎందుకు స్పందించలేదని దశరథరామిరెడ్డి నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో జరిగిన పై కార్యక్రమాల వివరాలు దిన పత్రికలు తెలంగాణ ఎడిషన్ లలో మాత్రమే ప్రచురించడంతో రాయలసీమ భవిష్యత్తుకు ప్రతి బంధకంగా మారే పై అంశాలు రాయలసీమ వాసుల దృష్టికి కూడా రాకుండా నియంత్రించడం శోచనీయం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఈ నేపథ్యంలో ఎవరో వస్తారని ఎదురు చూసి మోస పోకుండా రాయలసీమ నీటి హక్కుల సాధనలో, కుందూ నదిని కాపాడుకొనడంలో, ప్రాజెక్టుల సాధనకు మరింత స్ఫూర్తి దాయకంగా కార్యక్రమాలు చేపట్టడానికి రాయలసీమ రైతాంగం , ప్రజలు సిద్ధం కావాలని దశరథరామిరెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రచార కార్యదర్పులు నిట్టూరి సుధాకరరావ్, యం.వి.రమణారెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *