Breaking News

సీఎం వైఎస్ జ‌గ‌న్ సుపరిపాల‌న‌కు అవార్డులే నిద‌ర్శనం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-64వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనడానికి రాష్ట్రానికి వస్తున్న అవార్డులే నిదర్శనమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 64 వ డివిజన్ 280 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. కుందావారి కండ్రికలో విస్తృతంగా పర్యటించి.. 160 గడపలను సందర్శించారు. గ్రామంలో ఎక్కడకు వెళ్లినా, ఏ కుటుంబం తలుపుతట్టినా.. సంక్షేమ పథకాలు అందుతున్నాయనే ప్రజలు చెబుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మరోసారి తమ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు మూడేళ్లలో జరిగిన మేలును బుక్ లెట్ల ద్వారా తెలియజేశారు. విద్యా, వైద్య, గృహ నిర్మాణ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత.. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, పేదలందరికీ ఇళ్ల పథకాలను ప్రవేశపెట్టడం వెనుక గల ఆవశ్యకతను లబ్ధిదారులకు వివరించారు. రాష్ట్రంలోని ప్రతిఒక్క పేదవాడు ఉచితంగా వైద్య సేవలు పొందాలనే లక్ష్యంగా దివంగత మహానేత ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే.. ఆ సేవలను మరింత విస్తృత పరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. గ్రామంలో రూ. 20 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. డివిజన్ లో ఇప్పటివరకు దాదాపు రూ. 10 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజల గ్రీవెన్స్ మేరకు రామాలయం వీధిలో రెండు పార్కుల పరిరక్షణకు రూ. 40 లక్షల నిధులతో కాంపౌండ్ వాల్స్ నిర్మాణ పనులు ఇటీవల చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలో నూతన లైబ్రరీని ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని.. వాటిని సద్వినియోగపరచుకోవలసిందిగా విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. పర్యటనలో భాగంగా రైతుభరోసా కేంద్రాన్ని సందర్శించిన ఆయన.. ఆర్బీకే ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా.. పొలంబడి ద్వారా ఉత్తమ వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయ పద్ధతులపై అన్నదాతలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

అవార్డులు చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్షాల విమర్శలు
పోర్ట్‌ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టాత్మక ‘ఇన్ ఫ్రా ఫోకస్’ అవార్డు రావడం శుభపరిణామమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. కేంద్రం, వివిధ సంస్థల నుంచి అవార్డులు అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలోనే ముందంజలో ఉందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్, స్కోచ్ సహా పలు విభాగాలలో రాష్ట్రానికి వచ్చిన అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. అది చూసి ఓర్వలేక టీడీపీ, బీజేపీ, జనసేన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా నారా లోకేష్ విమర్శలు హాస్యాస్పదమని.. ఆయనను చూసి వైఎస్సార్ సీపీ కార్యకర్త కూడా భయపడరని విమర్శించారు. భయం అనే పథం వైఎస్సార్ సీపీ డిక్షనరీలోనే లేదని వ్యాఖ్యానించారు. 2024 లో వైఎస్సార్ సీపీని ఎలా ఢీకొనాలో తెలియక.. సీఎం వైఎస్ జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ నేతలకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. తెలుగుదేశానికి నిజంగా ధైర్యముంటే.. రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తు, మద్దతు లేకుండా పోటీ చేసే సత్తా ఉందా..? అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్ సీపీకి ప్రజలు వరుస విజయాలు అందించారని.. 2024లో జరగబోయే ఎన్నికల్లో 175 స్థానాలలోనూ వైఎస్సార్ సీపీ విజయఢంకా మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, వైసీపీ నాయకులు యరగొర్ల శ్రీరాములు, ఎం.రవీంద్రా రెడ్డి, దేవిరెడ్డి మంగారెడ్డి, జమల పూర్ణమ్మ, అక్తిశెట్టి నారాయణ, పిన్నిబోయిన కృష్ణ, దేవిరెడ్డి కిరణ్ రెడ్డి, మరీదు వీరయ్య, పందిరి వాసు, దేవిరెడ్డి సంజీవరెడ్డి, జిల్లెల్ల శివ, ఇస్మాయిల్, భోగాది మురళి, వరాలమ్మ, వెంకటేశ్వరమ్మ, కుమారి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *