విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రక్త దానం చేయడంద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చునని రక్త దానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు పిలుపునిచ్చారు. రక్తదాన అమృత మహోత్సవాలలో భాగంగా నగరంలోని క్రొత్త ప్రభుత్వాసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ మండలి, ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్త దానం గొప్పదన్నారు. దేశవ్యాప్తంగా లక్ష రక్త యూనిట్లు సేకరించడంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 రక్తనిధి కేంద్రాల్లో స్వచ్ఛంద రక్త దాన శిబిరాలు ప్రారంభించి రక్తదానాన్ని సేకరిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకు లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రక్తాన్ని అందించాలన్నారు. ప్రతీ బ్లడ్ బ్యాంకు సేకరించిన రక్తం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిరుపేదలైన ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, తలసీమియా, డయాలసిస్ రోగులకు ఉచితంగా రక్తాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరూ రక్తాన్ని దానం చేయవచ్చునని యువత సామజిక బాధ్యతగా రక్త దానం చేసేందుకు ముందుకురావాలన్నారు. రక్తదానం చేయడం – సంఘీభావం చాటడం, చేయి, చేయి కలుపుదాం – ప్రాణాన్ని కాపాడుదాం అనే నినాదం మెగా రక్తదాన కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అక్టోబర్ 1వ తేదీ వరకూ నిర్వహించే జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాలు శస్త్ర చికిత్సలు జరిగే సమయాల్లో రక్తం ఏంతో అవసరం ఉంటుందన్నారు. మనం రక్తాన్ని దానం చేయడం ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెట్టడం సాధ్యం అవుతుందనే స్పృహ ప్రతిఒక్కరిలో ఉండాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతీ ఆరునెలలకొకసారి రక్తదానం చేయవచ్చునని తద్వారా ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా ఉత్సాహవంతులుగా పనిచేస్తారని కలెక్టర్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు నిర్వహించిన రక్తదాన శిబిరాలలో 600 యూనిట్లు రక్తాన్ని సేకరించామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. మెగా రక్తదాన శిబిరంలో సిద్దార్ధ వైద్య కళాశాల విద్యార్థులు, యువత స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేసారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ జిల్లా కలెక్టర్ ధ్రువపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎమ్. సుహాసిని, అడిషనల్ డి. ఎమ్.అండ్ హెచ్ ఓ డా. జె. ఉషారాణి, ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా. సౌభాగ్యలక్ష్మి, ఆర్ ఎమ్ ఓ డా. శోభా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస రావు, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ కిరణ్, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ కళ్యాణి, జిల్లా ప్రోగ్రాం సూపర్ వైజర్ ప్రశాంతి ఉన్నారు.
Prajavartha Online Telugu News