విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జన్మనిస్తూ ఏ తల్లీ, జన్మించిన ఏ శిశువు మరణించరాదని అందుకు గర్భవతి, కాన్పు సమయంలో అందవలసిన అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాదికారులు సకాలంలో అందించి మాతా, శిశుమరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో జిల్లా లో నమోదైన ఆరు శిశుమరణాలపై జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మరణాలకు దారితీసిన పరిస్థితులపై వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంగన్వాడీ సూపర్వైజర్ల తో కేసు వారీగా మెటర్నల్ డెత్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మరణాల పై సంబందిత డాక్టర్లు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సేవల ద్వారా నివారించ దగ్గ అన్ని రకాల మాతా,శిశు మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికలతో మరణాలు జరగ కుండా చూడాలన్నారు. గర్భ వతుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించరాదని అలాగే ఈ.డి.డి (ఎక్స్ పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భవతులందరికి స్కానింగ్ మరియు ఈ.సి.జి లు నిర్వహించి లోపాలను సరిదిద్ది సురక్షిత కాన్పు జరిగేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రెగ్యులర్ వైద్య పరీక్షలు తప్పని సరిగా జరగాలన్నారు. గర్భం దాల్చిన నాటి నుండి ప్రసవం జరిగే వరకు నిరంతరం పర్యవేక్షణ తప్పని సరి అన్నారు. హైరిస్క్ గర్భవతుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రి, జిల్లా స్థాయి ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ ఉండాలన్నారు. ప్రతీ నెల 9వ తేదీన పి హెచ్ సి, ఏరియా ఆస్పత్రులలో నిర్వహించే ప్రధానమంత్రి సురక్ష యోజన లో ప్రతీ గర్భిణీ స్త్రీకి తప్పని సరిగా వైద్య పరీక్షలు చేయించాలని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు. గర్భం దాల్చిన అత్తవారింటి వద్దనుండి ప్రసవానికి వచ్చే పుట్టింటి వరకు ప్రతీ గర్భవతి అరోగ్య నివేదిక జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వైద్య ఆరోగ్య, మాతా శిశు సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ మరణాలు సంభవించటం దురదృష్ట కరమన్నారు. భవిష్యత్తులో జిల్లాలో ఎటువంటి మాతా శిశు మరణాలు సంభవించని జిల్లాగా నమోదు కావాలని కలెక్టర్ ఢిల్లీ రావు వైద్యాధికారులను కోరారు. ఈ సమావేశంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డి.యం అండ్ హెచ్ ఓ,డా. ఎం. సుహాసిని,, డి సి హెచ్ ఎస్ డా. లక్ష్మీ కుమారి, డాక్టర్లు, వైద్య సిబ్బంది, పి హెచ్ సి ల మెడికల్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News