-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-61వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం 61 వ డివిజన్ 261 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. తొలుత దివంగత నేత వంగవీటి మోహనరంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పాత పాయకాపురంలోని వీధులలో విస్తృతంగా పర్యటించి.. 210 గడపలను సందర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తోన్న సంక్షేమాన్ని బుక్ లెట్ల ద్వారా వివరించారు. ప్రజలకు నిత్యం మంచి జరగాలని కోరుకునే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలే ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకునేవారని.. ఇప్పుడా పరిస్థితి మారిందన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పథకాలు మంజూరు అవుతుండటంతో ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్థానికుల అవసరాలు, సమయానుకూలతను బట్టి తాగునీటి సరఫరా జరగాలని వీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. వర్షపు నీటికి అంతర్గత రోడ్లు మునగకుండా రహదారుల ఎత్తు పెంచాలని.. అలాగే ఆయా రహదారులకు యూజీడీ కనెక్షన్ ఇవ్వవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇళ్లపై వాలిన విద్యుత్ వైర్లను దూరంగా మార్చాలని.. ఒరిగిన ఎలక్ట్రికల్ పోల్స్ ను తక్షణమే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాలలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలన్నారు.
సచివాలయ పరిధిలో రూ.3.49 కోట్ల సంక్షేమం.. డివిజన్ లో రూ. 10.13 కోట్ల అభివృద్ధి
సెంట్రల్ నియోజకవర్గంలోని 96 వార్డు సచివాలయాలలో కనీసం రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు సంక్షేమాన్ని ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో నిరుపేద కుటుంబాలకు అందజేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. 261 వ వార్డు సచివాలయానికి సంబంధించి మూడేళ్లలో రూ. 3.49 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు వెల్లడించారు. అలాగే 61వ డివిజన్ లో అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు రూ. 10.13 కోట్ల పనులు మంజూరైనట్లు వివరించారు. వీటిలో రూ. 1.86 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 5.81 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. మరో రూ. 2.44 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. హిందూ శ్మశానవాటికలో రూ. 15 లక్షల వ్యయంతో నూతన షెడ్డు నిర్మాణానికి సంబంధించి గత మూడు నెలల కాలంలో మూడు సార్లు టెండర్లను ఆహ్వానించడం జరిగిందన్నారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని.. మరలా టెండర్లను ఆహ్వానించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం శవ రాజకీయాలు మానుకోవాలి
రాష్ట్రంలో చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు విమర్శించారు. ఉనికిని కోల్పోయి ఏమి చేయాలో తెలియక ప్రతిపక్షాలు చివరకు చనిపోయిన వారి మృతదేహాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారాయని మండిపడ్డారు. ప్రమాదాలు, విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను మానవీయ కోణంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు వివరించారు. 58వ డివిజన్ కు చెందిన తోట పవన్ కళ్యాణ్ అనే యువకుడు ఇటీవల ప్రమాదవశాత్తు మద్రాస్ నగరంలో సముద్రంలో మునిగి మృతి చెందగా.. అతని కుటుంబానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. సూర్యలంకలో ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. కానీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం నాయకులు చేస్తున్న శవ రాజకీయాలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చివరకు దుర్గమ్మ దర్శనానికి వచ్చి కూడా చంద్రబాబు రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 2019లో అమరావతి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు, నారాలోకేష్ లను.. మంగళగిరి సహా అన్ని ప్రాంతాలలో ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఘోర పరాజయం పాలైనా.. తెలుగుదేశం నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి, అందులో అమరావతి కూడా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు వివరించారు. చంద్రబాబు మాత్రం అమరావతిలోని రియల్టర్లు మాత్రమే బాగుండాలనే దురాలోచనతో కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. కానీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉన్నత లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఇప్పటికే జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో ప్రజలకు ఆయా జిల్లాల కేంద్రాలకు వెళ్లడం సులభతరంగా మారడంతో.. పాలన సుగుమం అయిందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు దుష్ట రాజకీయాలు మానుకోవాలని.. లేకుంటే మరోసారి దుర్గమ్మ తల్లి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి, నాయకులు ఉమ్మడి వెంకట్రావు, ఎస్.కోటేశ్వరరావు, ఎం.అనిల్ కుమార్, రామిరెడ్డి, నాళం బాబు, ఆర్.ఎస్.నాయుడు, గుండె సుందర్ పాల్, భోగాది మురళి, వియ్యపు రాజా, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News